వ‌ర్మ చేతిలో ఎన్టీఆర్ జీవితం

సంచ‌ల‌నాల ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ మ‌రో బాంబు పేల్చారు. య‌దార్థ గాథ‌ల‌ను త‌న‌దైన టేకింగ్‌తో వెండితెర‌పై ఆవిష్క‌రించిన వ‌ర్మ‌.. ఇప్పుడు తెలుగు సినిమా గ‌తిని, రాజ‌కీయాల‌ను మార్చేసిన విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్‌ను తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో అటు రాజ‌కీయ నాయ‌కుల్లోనూ ఇటు సినీ వ‌ర్గాల్లోనూ ఆస‌క్తికర చ‌ర్చ మొద‌లైంది. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఎత్తుప‌ల్లాలు, ఆటుపోట్లు. స‌న్మానాలు, ఒడిదుడుకులు.. క‌ష్టాలు అన్నీ ఉన్నాయి. ఇవ‌న్నీ రాజ‌కీయాల‌కు ముడి ప‌డి ఉన్నాయి. మ‌రి వీట‌న్నింటినీ వ‌ర్మ ఎలా తెర‌కెక్కిస్తాడు? అన్ని సంఘ‌ట‌న‌లను య‌దార్థంగా ఆవిష్క‌రిస్తాడా? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్నాయి.

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ చేతిలో ఎన్టీఆర్ జీవితం ఆధారపడి ఉంది. ఆయన దివంగత మాజీ ముఖ్యమంత్రి తారకరత్న నందమూరి తారకరామారావు బయోపిక్ ను తీసేందుకు సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తున్నానని ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకుని చిత్రాలు తీయడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య. పరిటాల రవి పై తీసిన రక్త చరిత్ర, విజయవాడ ఫ్యాక్షన్ ఆధారంగా తీసిన వంగవీటి సినిమా, వీరప్పన్ యదార్థగాథ‌ వంటివి వర్మ‌లోని మ‌రో ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తాయి. అయితే ఈ సినిమాల్లోనూ వివాదాలు చోటు చేసుకున్నాయి.

అయితే నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను తానే తెరకెక్కించబోతున్నట్లు వర్మ ప్రకటించారు. ఇందులో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్ర చేయనున్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర అంటే కేవలం సినిమాలే కాకుండా పాలిటిక్స్ కు కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి రికార్డు స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కాగలిగారు. ఆయన లక్ష్మీపార్వతిని రెండో వివాహం కూడా చేసుకున్నారు. లక్ష్మి తన భార్య అంటూ బహిరంగ సభలోనే ఎన్టీఆర్ ప్రకటించారు. అలాగే ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు మామను గద్దెను దించి సీఎం అయిన విషయాన్ని కూడా ఈ చిత్రంలో వర్మ చూపుతారా? లేక రాజ‌కీయ జీవితం ప్రారంభం వ‌ర‌కూ తీసుకొచ్చి ముగిస్తారా? అనేది చూడాలి.

ఇక అదేస‌మ‌య‌లో కుటుంబసభ్యుల మధ్య రేగిన వివాదాలు, ఎన్టీఆర్ చివరి దశలో చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ఏపీలో సంచలనమయ్యాయి. ఇవన్నీ వర్మ తన సినిమాలో చూపించగలరా? బాలయ్య బాబు అందుకు అంగీకరిస్తారా? అనేది మాత్రం ఇప్పటి వరకూ సస్పెన్స్. మ‌రి ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర అంటే ఆషామాషీ కాదు.. రాజ‌కీయాల‌తో ముడిప‌డిన అంశాలు అనేకం! మ‌రి వాట‌న్నిటినీ ఈ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు ఎలా తెర‌కెక్కిస్తాడో!!