శశికళ వర్గంపై పోరు ఆగదు … పన్నీరు సెల్వం కొత్త పార్టీ

February 20, 2017 at 8:22 am

మ‌డ‌మ తిప్పే అవ‌కాశం లేదంటున్నారు త‌మిళ‌నాడు మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం! శశిక‌ళ వర్గంపై పోరు ఆగ‌దు అని స్ప‌ష్టం చేస్తున్నారు. అసెంబ్లీలో జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష‌లో ప‌ళ‌నిస్వామి విజ‌యం సాధించ‌డంతో.. త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై ప‌న్నీర్ వ్యూహాలు ర‌చిస్తున్నారు. త‌న‌పై వేటు ప‌డ‌టం ఖాయ‌మ‌ని నిర్ణ‌యించుకున్న ఆయ‌న‌.. స‌రికొత్త రాజ‌కీయ వేదిక‌ను ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అన్నాడీఎంకేలో కొన‌సాగ‌లేక‌.. డీఎంకేలో చేరే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో సొంతంగా పార్టీ పెట్టాల‌ని నిర్ణయించుకున్నార‌ట‌. పార్టీ పేరు, గుర్తు కూడా ఖరారుచేసిన‌ట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సీఎం పీఠంపై శ‌శిక‌ళ‌ను కూర్చోనివ్వ‌కుండా.. ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసిన ప‌న్నీర్‌.. ఇప్పుడు ఏకాకిగా మారిపోయారు. శ‌శిక‌ళ జైలు శిక్ష ప‌డ‌టంతో.. ఎమ్మెల్యేలంతా త‌న‌వైపు ఉంటార‌ని ఊహించిన ఆయ‌న‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. శాస‌న‌స‌భ‌లో బ‌ల‌ప‌రీక్ష‌లో చిన్న‌మ్మ వ‌ర్గానికి చెందిన ప‌ళ‌నిస్వామి మెజారిటీ సాధించడంతో.. దిక్కుతోచని స్థితిలో ప‌డిపోయారు ప‌న్నీర్‌! ప‌న్నీర్‌తో పాటు మ‌రో 11 మంది విప్‌ను ధిక్క‌రించ‌డంతో వారిపై ఇప్పుడు వేటు త‌ప్ప‌దు. దీంతో ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి. అందుకే తాను సొంతంగా పార్టీ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.

నిజానికి ప‌న్నీర్ సెల్వం పార్టీని ఒక ఆరునెల‌లు ఆగి పెట్టాల‌ని అనుకున్నార‌ట‌. వేటు ప‌డితే శాస‌న‌స‌భ నుంచి ఆయన బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌వుతారు. ఆరునెల‌ల్లో ఉప ఎన్నిక‌లు వ‌చ్చేస్తాయి. ఉప ఎన్నిక‌ల్లో తాను నిల‌బ‌డ‌లాంటే ఏదో ఒక పార్టీ త‌ర‌పున పోటీ చేయాల్సిందే. అటు అన్నాడీఎంకే నుంచి పోటీ చేసే అవ‌కాశం లేదు. ఇక డీఎంకే త‌ర‌ఫున స‌రేస‌రి! ఇత‌ర పార్టీల త‌ర‌పున ఆయ‌న పోటీ చేస్తే జ‌నామోదం ల‌భించ‌దు. అదే కొత్త పార్టీ పెడితే క‌లిసొచ్చే అవ‌కాశ‌ముంద‌నేది ప‌న్నీర్ వ్యూహ‌మట‌. దీంతో `అమ్మాడీఎంకే` పేరుతో కొత్త పార్టీ పెట్ట‌బోతున్నార‌ట‌.

అన‌ర్హ‌త వేటు వేయ‌క‌ముందే… పార్టీని ప్ర‌క‌టించి జ‌నంలోకి వెళ్లాల‌న్న‌ది సెల్వం ప్లాన్. `అమ్మాడీఎంకే` పేరుతో జ‌నంలో త‌న‌కున్న సానుభూతిని అనుకూలంగా మ‌లుచుకునేందుకు ఆయ‌న‌ సిద్ధంగా ఉన్నార‌ట‌. మ‌రి ప‌న్నీర్ కొత్త పార్టీ `అమ్మాడీఎంకే` త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఎలాంటి మార్పుల‌కు కార‌ణ‌మ‌వుతుందో `అమ్మే` నిర్ణ‌యించాలి!

శశికళ వర్గంపై పోరు ఆగదు … పన్నీరు సెల్వం కొత్త పార్టీ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share