శ‌శిక‌ళ‌ను ప‌క్క‌న పెట్టిన అన్నాడీఎంకే

March 18, 2017 at 6:50 am

అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ‌కు కాలం క‌లిసి రావట్లేదు! తన వ‌ర్గం వారే ఇప్పుడు ఆమెను పట్టించుకోవ‌డం లేదు! త‌న త‌ర‌ఫున సీఎం ప‌ద‌విలో కూర్చోపెట్టిన ప‌ళ‌ని స్వామి ఇప్పుడు చిన్న‌మ్మ వంకే చూడ‌టం లేద‌ట‌. అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు కూడా ఆమెను లైట్ తీసుకోవ‌డం మొద‌లుపెట్టార‌ట‌. దీంతో న‌మ్మిన వారే ఇలా చేయ‌డంతో శ‌శిక‌ళ తీవ్రంగా ఆగ్ర‌హానికి గుర‌వుతున్నార‌ట‌. ఇప్పుడు దీనికి తోడు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విలో ఆమె ఉంటారో లేదో రెండు రోజుల్లో స్ప‌ష్ట‌త రానుంద‌ట‌. దీంతో ఒక‌వేళ ఆ ప‌ద‌వి నుంచి ఆమెను తొల‌గిస్తే.. ఇక ఆమె సామాన్య‌నురాల‌వ‌డం ఖాయం!!

బెంగళూరులోని అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్న శశికళ ఆగ్రహంతో రగలిపోతున్నట్లు సమాచారం. ఆస్తుల కేసులో శశికళ జైలు జీవితానికి నెలరోజులు పూర్తయ్యాయి. జైలుకు వెళ్లిన తొలి దినాల్లో పరామర్శకు వచ్చిన నేతలు క్రమేణా కనుమరుగయ్యారని ఆమె కోపంతో ఉన్నార‌ట‌. నెలరోజుల్లో మంత్రులు సెంగొట్టయ్యన్, దిండుగల్లు శ్రీనివాసన్, సెల్లూరు రాజా, ఆర్‌ కామరాజ్ ఆమెను చూసి వచ్చారు. ఆ తరువాత మాజీ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర, అధికార ప్రతినిధి సీఆర్‌ సరస్వతి, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ బెంగళూరులో కలిశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎడపాడి పళనిస్వామి, కొందరు మంత్రులు బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

విశ్వాసపరీక్షలో నెగ్గిన తరువాత రావాల్సిందిగా చిన్నమ్మ ఆదేశించడంతో ఆగిపోయారు. అయితే విశ్వాసపరీక్షలో నెగ్గిన తరువాత సీఎం ఎడపాడి చిన్నమ్మను మరిచిపోయారు. ఇప్పటి వరకు బెంగళూరు వెళ్లకపోవడం శశికళ ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. సీఎం మాత్రమే కాదు కొన్ని రోజులుగా ఎవ్వరూ తనను చూసేందుకు రాకపోవడంపై శశికళ ఆసంతృప్తితో రగిలిపోతున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ భవిష్యత్తు ఏమిటో రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది. శశికళ ఎంపిక చెల్లదంటూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం చేసిన ఫిర్యాదుపై ప్రధాన ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) 20వ తేదీన తీర్పు చెప్పనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

కాగా ఆర్కేనగర్‌లో ఉప ఎన్నికలు జరుగుతుండగా అభ్యర్థులకు ఈనెల 24వ తేదీలోగా బీఫారం అందజేయాల్సి ఉంటుంది. బీఫారం అందజేసిన వారికి ఎన్నికల కమిషన్‌ ఎన్నికల చిహ్నాన్ని కేటాయిస్తుంది. అన్నాడీఎంకే ఎన్నికల చిహ్నం రెండాకులు తమదేనంటూ శశికళ, పన్నీర్‌వర్గాలు వాదించుకుంటున్నాయి. అర్కేనగర్‌ ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి అత్యవసర పరిస్థితులు నెలకొని ఉన్నందున ఈనెల 20వ తేదీన సీఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సమాచారం.

 

శ‌శిక‌ళ‌ను ప‌క్క‌న పెట్టిన అన్నాడీఎంకే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share