అఖిల్ ప్రియ ఎంట్రీతో ఎవరికి చెక్..!

తండ్రికి ద‌క్క‌నిది కూతురికి ద‌క్కుతుందా? అనే ప్ర‌శ్న ఇప్పుడు అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది. నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో.. ఆయ‌న అనుచ‌రులను తీవ్రంగా క‌లిచివేస్తోంది. మంత్రి వ‌ర్గంలో చేరాల‌నే కోరిక‌.. తీర‌కుండానే ఆయ‌న క‌న్నుమూశారు! దీంతో ఇప్పుడు ఆయన కూతురు అఖిల ప్రియకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నే డిమాండ్ పెరుగుతోంది.

ఈనేప‌థ్యంలో కేబినెట్‌లోకి ఆమె ఎంట్రీ ఇస్తే.. ఇప్పుడు ఎవ‌రికి చెక్ చెబుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే ముగ్గురు మ‌హిళ‌లు మంత్రులుగా కేబినెట్లో ఉన్నారు. మ‌రి అఖిల‌ప్రియ‌కు చోటు క‌ల్పిస్తే.. వీరిలో ఎవ‌రినైనా తొలిగిస్తారా లేక కొత్త‌గా నాలుగో మ‌హిళ‌ను కేబినెట్లోకి తీసుకుంటారా అనేది ప్ర‌శ్న‌!!

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరిగినప్పుడు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని తెదేపా వర్గాలు భావిస్తున్నాయి. ముందుగా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పేరే ప్రముఖంగా వినిపించింది. మంత్రివర్గంలో చేరడం ఆయన కోరిక అనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే! ఇదే హామీపై ఆయ‌న వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. అయితే ఆకస్మికంగా మరణించడంతో ఆయన కుమార్తె అఖిలప్రియ పేరును పరిగణనలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు.

బడ్జెట్‌ సమావేశాలు ముగిశాక… ఏప్రిల్‌లో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరగనున్నాయి. తెదేపాతో కొన్ని దశాబ్దాల అనుబంధం ఉన్న భూమా కుటుంబం మధ్యలో ప్రజారాజ్యం, వైకాపాల్లోనూ ఉంది. గత ఎన్నికల్లో వైకాపా తరఫునే నాగిరెడ్డి, అఖిలప్రియలు ఎన్నికైనా… కిందటేడాది తెదేపాలో చేరారు. వైకాపా నుంచి వచ్చినప్పటికీ నాగిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించినట్లు ఆయన సన్నిహిత వర్గాల కథనం. అయితే ఇప్ప‌టికే మంత్రి వ‌ర్గంలో కిమిడి మృణాళిని, ప‌రిటాల సునీత‌, పీత‌ల సుజాత‌.. మంత్రి వ‌ర్గంలో ఉన్నారు.

వీరి ముగ్గురి ప‌నితీరుపై సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద నివేదిక ఉంది. ఇప్పుడు అఖిల ప్రియ‌ను తీసుకుంటే వీరిలో ఎవ‌రో ఒక‌రికి చెక్ పెట్ట‌క త‌ప్ప‌దు. దీంతో వీరి ముగ్గురిలో ఇప్పుడు టెన్ష‌న్ మొద‌లైంది. ఒక‌వేళ అఖిల ప్రియ‌కు చోటు ద‌క్క‌క‌పోతే.. భూమా వ‌ర్గం నుంచి నిర‌స‌న ఎదుర్కోక త‌ప్ప‌దు!!  మ‌రి చంద్ర‌బాబు ఇప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటార‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.