అన్నాడీఎంకేలో భారీ చీలిక…!

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు వేగంగా మారిపోయాయి! పూర్తి ఆరోగ్యంతో ఆస్ప‌త్రి నుంచి తిరిగి వ‌చ్చి అధికార ప‌గ్గాలు చేప‌డుతుంద‌ని భావించిన అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత క‌న్నుమూయ‌డం రాష్ట్రానికి ముఖ్యంగా పార్టీకి పెను దెబ్బ‌గా ప‌రిణ‌మించింది. మ‌రోప‌క్క‌, అధికార పార్టీకి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించ‌డ‌మే త‌ప్ప త‌న త‌ర్వాత ఎవ‌రు ఈ పార్టీని లీడ్ చేయాలి? ఎవ‌రు న‌డిపించాలి? ఎవ‌రికి అన్నాడీఎంకే ప‌గ్గాలు అప్ప‌గించాలి? అనే అంశంపై జ‌య దృష్టి పెట్ట‌లేక‌పోవ‌డం కూడా ఇప్పుడు పెను ప‌రిణామాల‌కు, అన్నాడీఎంకే పార్టీ భ‌విత‌వ్యానికి స‌వాలుగా మారాయి.

వాస్త‌వానికి అన్నాడీఎంకేలో అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన జ‌య.. ఏ ఒక్క‌రినీ స్వ‌తంత్రంగా ఎద‌గ‌నీయ‌లేద‌నే చెప్పాలి. క‌నీసం.. చిన్న‌పాటి నిర్ణ‌యాలు కూడా తీసుకునే రేంజ్‌లో ఏ ఒక్క‌నాయ‌కుడు లేదా నాయ‌కురాలికి ఆమె స్వేచ్ఛ‌నివ్వ‌లేదు. దీంతో ఇప్పుడు ఆమె లేక‌పోవ‌డం పార్టీని ఎవ‌రు న‌డిపించాల‌నే ప్ర‌శ్న‌, అస‌లు ఎవ‌రు ఎవ‌రిమాట విని ముందుకు న‌డ‌వాల‌నే శూన్య‌త ఆవ‌రించాయి. ఇప్ప‌టికైతే.. జ‌య‌కు న‌మ్మిన బంటుగా ఉన్న ప‌న్నీర్ సెల్వం సీఎంగా ప్ర‌మాణం చేశారు. అయితే, దీనికి కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. బీజేపీ నేత‌, మాజీ కాంగ్రెస్ నేత సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి అన్న‌ట్టు.. వేరే ఎవ‌రైనా సీఎం ప‌ద‌విని ఎందుకు చేప‌ట్ట‌కూడ‌దు! అంటే చెప్పే వారు క‌రువ‌య్యారు.

అదేవిధంగా శ‌శిక‌ళ‌ను పార్టీకి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని చేశారు. అన్నాడీఎంకేలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అంటే.. ఇటు పార్టీకే కాకుండా ప్ర‌భుత్వానికి కూడా గుండె వంటి పోస్టు. అన్నీ ఆ పోస్టులో ఉన్న‌వారు చెప్పిన‌ట్టే జ‌ర‌గాలి. ఇది అమ్మ శాస‌నం. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పోస్టులో జ‌యే ఉన్నారు కాబ‌ట్టి. మ‌రి ఈ పోస్టు ఇప్పుడు శ‌శిక‌ళ‌ల‌కు ద‌ఖ‌లు ప‌డింది. మ‌రి ప‌న్నీర్ సెల్వం ఆమె మాట వింటాడా? అలాగే మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆమె మాట వింటారా? అంటే సందేహ‌మే! అమ్మ మాట వేరు. శ‌శిక‌ళ విషయం వేరు. గతంలో శ‌శిక‌ళ .. పార్టీ నుంచి సస్పెండ్ అయింది. కాబ‌ట్టి మిగిలిన నేత‌ల్లో ఆమె ప‌ట్ల చుల‌క‌న భావం ఉంది.

దీంతో ఇప్పుడు అన్నాడీఎంకేలో రెండు అధికార కేంద్రాలు ఒక‌టి ప‌న్నీర్ సెల్వం, రెండు శ‌శిక‌ళ గా విడిపోతాయ‌నేది విశ్లేష‌కుల మాట‌. సో.. మ‌రి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అన్నాడీఎంకేలో చీలిక త‌ప్ప‌దా అనే ప‌రిస్థితి నెల‌కొంది. ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇదిలావుంటే, వేరే ప‌క్షాలైన కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, డీఎంకేలు గానీ అన్నాడీఎంకేలో నెల‌కొన్ని ఈ ప‌రిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుంటే ప‌రిస్థితి మ‌రింత దారుణ‌మై.. ఉనికికే ప్ర‌మాదం సంభ‌వించే ఛాన్స్ లేక‌పోలేదని పొలిటిక‌ల్ పండితులు చెబుతున్న మాట‌.