ఇది చంద్రబాబు మార్క్ రాజకీయం

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడికి రాజ‌కీయాల్లో దాదాపుగా నాలుగు ద‌శాబ్దాలుగా అనుభ‌వం ఉంది. ఏక‌ధాటిగా 9 ళ్లు సీఎం, మ‌రో పదేళ్లు ప్ర‌తిప‌క్ష‌నేత‌, తిరిగి ఏపీకి సీఎంగా మ‌రో మూడు సంవ‌త్స‌రాల పాల‌న ఇలా చెప్పుకుంటూ పోతే చంద్ర‌బాబు రాజ‌కీయ అనుభ‌వం మామూలుగా ఉండ‌దు. పార్టీలో ఎంత పెద్ద సీనియ‌ర్ల విష‌యంలో అయినా చంద్ర‌బాబు త‌న మార్క్‌తో అసంతృప్తుల‌ను చ‌ల్లార్చేస్తుంటారు.

ఆయ‌న తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఒకే జిల్లాలో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌ద‌ర్శించిన రాజ‌కీయానికి అంద‌రూ షాక్ అవ్వాల్సిందే. దాన్నే బాబు మార్క్ రాజ‌కీయం అనొచ్చు. ప్ర‌కాశం జిల్లాలో చంద్ర‌బాబుకు పెద్ద త‌లనొప్పిగా ఉన్న నియోజ‌క‌వర‌వ్గాల్లో చీరాల‌, అద్దంకి ఉన్నాయి.

కీల‌క‌మైన అద్దంకిలో పార్టీలో ఆదినుంచి వ‌స్తోన్న క‌ర‌ణం బ‌ల‌రాం వ‌ర్సెస్ ఇటీవ‌ల వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన గొట్టిపాటి ర‌వికుమార్ మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌డం లేదు. చంద్ర‌బాబు వీరి మ‌ధ్య ఎన్నిసార్లు రాజీ చేసినా వీరు గొడ‌వ‌లు ఆప‌లేదు. ఇక అటు చీరాల‌లో ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్ టీడీపీలోకి వ‌చ్చారు. అక్క‌డ టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన పోతుల సునీత‌కు ఆమంచి ఉప్పు నిప్పులా ఉంటున్నారు.

ఈ పరిస్థితుల్లో ఈ రెండు నియోజకవర్గాల పరిస్థితిని గాడిలో పెట్టేందుకు బాబు ఓ స్కెచ్ వేశారు. అయినా అవేమి ఫ‌లించ‌లేదు. చివ‌ర‌కు తీవ్ర ఒత్తిళ్ల మ‌ధ్య ప్ర‌కాశం జిల్లా నుంచి క‌ర‌ణం బ‌ల‌రాంకు, పోతుల సునీత‌కు ఎమ్మెల్సీ ఛాన్సులు ఇస్తున్న‌ట్టు చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. దీంతో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో అంత‌ర్గ‌త క‌ల‌హాలు లేకుండా చేయ‌డంతో పాటు 2019 ఎన్నిక‌ల్లో టికెట్ విషయంలో అనవసర ఊహాగానాలకు తెర దించేశారు.

బాబు మార్క్ రాజ‌కీయంతో అద్దంకి, చీరాల‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు స్వేఛ్ఛగా ప‌నిచేసుకునేలా చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా వీరిద్ద‌రికే టిక్కెట్లు క‌న్‌ఫార్మ్ అనుకోవ‌చ్చు.