కర్నూలులో టీడీపీకి మరో బిగ్ షాక్.. వైసీపీ బలం రెట్టింపైనట్టే!!

క‌ర్నూలులో టీడీపీకి భారీ షాక్ త‌గ‌లబోతోంది. నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరిక‌తో జిల్లాలో పార్టీ బ‌ల‌ప‌డుతుంద‌ని ఊహించిన అధిష్ఠానానికి.. ఇప్పుడు అదే త‌ల‌నొప్పిగా మారింది. బ‌ల‌పడాల్సిన చోట‌.. మ‌రింత బ‌ల‌హీనంగా మారుతోంది. ఇప్ప‌టికే పార్టీ సినియ‌ర్ నేత గంగుల ప్ర‌భాక‌ర్ రెడ్డి వైసీపీ కండువా క‌ప్పుకుని.. జ‌గ‌న్ చెంత‌కు చేరిపోయారు. ఇప్పుడు భూమా చేరిక‌ను తొలి నుంచి తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న శిల్పా వ‌ర్గం కూడా.. వైసీపీలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌ని స‌మాచారం! జిల్లాలో ఇద్ద‌రు కీల‌క‌మైన నేత‌లు పార్టీని వీడటం.. టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బే!!

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ క‌ర్నూలు జిల్లా రాజకీయాల‌ను హీటెక్కిస్తోంది. ముఖ్యంగా నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని.. టీడీపీలో చ‌ర్చ మొద‌లైన నాటి నుంచి తెలుగు త‌మ్ముళ్ల‌లో వ‌ర్గ విభేదాలు ముదిరి పోయాయి. ముఖ్యంగా పార్టీలో చేరిన నాటి నుంచి.. సీఎం చంద్ర‌బాబు.. భూమా వ‌ర్గానికి ప్రాధాన్యం ఇవ్వ‌డం.. ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల‌కు మింగుడుప‌డ‌టం లేదు. దీంతో జిల్లా టీడీపీ సీనియర్లు వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం మొదలైంది. ప్ర‌స్తుతం శిల్సా బ్రదర్స్ కూడా వైసీపీ గూటికి చేరబోతున్నారనే ప్ర‌చారంతో అధిష్ఠానం రంగంలోకి దిగింది. భూమా నాగిరెడ్డి, శిల్పా బ్రదర్స్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

కర్నూలు ఎమ్మెల్యే ఎస్పీ మోహన్‌రెడ్డిని చంద్ర‌బాబు రంగంలోకి దింపారు. ఎస్పీ, శిల్పా బ్రదర్స్ మధ్య జరిగిన చర్చల్లో ఆశించని ఫలితం రాలేదు. భూమాకు మంత్రి పదవి ఇస్తే మా పరిస్థితి ఏమిటని శిల్పా బ్రదర్స్ చంద్రబాబు స్వయంగా విన్నవించుకున్నారు. భూమా, శిల్పా సోదరుల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలోనే ఆళ్లగడ్డ టీడీపీ ఇన్‌చార్జి గంగుల ప్రభాకర్‌రెడ్డి వైసీపీలో చేరారు.

శిల్పా సోదరులు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో వెళ్లేందుకు సిద్ధమవుతున్న త‌రుణంలో.. వైసీపీ కూడా నెమ్మ‌దిగా పావులు క‌దుపుతోంది. డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మధ్యవర్తిత్వం చేసి శిల్పా బ్రదర్స్‌ను వైసీపీలోకి చేర్చేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. ఇక ఆళ్లగడ్డ టీడీపీ నేత ఇరిగెల రాం పుల్లారెడ్డి కూడా పక్క పార్టీ వైపే చూస్తున్నారట. ఇప్ప‌టికే జిల్లాలో బ‌లంగా ఉన్న టీడీపీని.  వీరంతా వీడితే వైసీపీ బ‌లం రెట్టింపైన‌ట్టే!!