చంద్రబాబు కొత్త బాధ్యతలు ట్రయిలర్‌… ఉక్కిరిబిక్కిరి లో కొత్త మంత్రులు

అన్న ప్రాస‌న రోజే ఆవ‌కాయ అనే నానుడి ఎంతో సుప‌రిచితం!!  ఇప్పుడు ఏపీలో కొత్త కేబినెట్లో మంత్రులు కూడా దీనిని గుర్తుచేసుకుని బోరుమంటున్నారు. ఎన్నో రోజులు ఊరించి ఊరించిన సీఎం చంద్ర‌బాబు.. ఆఖ‌రుకి తన క్యాబినెట్‌ను ప్ర‌క‌టించారు. ఇందులో పాత‌, కొత్తవారితో క‌లిపి మొత్తం 25 మంది ఉన్నారు. దీంతో కొత్తగా ప‌ద‌వి పొందిన వారి ఆనందానికి అవ‌ధుల్లేవు. అలాగే త‌మ ప‌ద‌వి ప‌దిలమైనందుకు కొంత‌మంది సంబ‌ర‌ప‌డ్డారు. కానీ ఆ ఆనందం, సంబ‌రం కొద్ది గంటల్లోనే ఆవిరి చేసేశారు అధినేత చంద్ర‌బాబు! ఇలా ప‌ద‌వి చేప‌ట్టారో లేదో.. అంత‌కంటే బ‌రువైన బాధ్య‌త‌ను వారి భుజ‌స్కందాల‌పై మోపారు. దీంతో మంత్రులంతా లోలోపలే మ‌థ‌న‌ప‌డిపోతున్నార‌ట‌.

మంచి శాఖల వ‌చ్చాయ‌న్న‌ ఆనందంలో ఉన్న మంత్రుల‌కు చంద్రబాబు వ‌ద్ద నుంచి స‌మాచారం అందింది. సమన్వయ కమిటీ సమావేశం.. మధ్యాహ్నం క్యాబినెట్‌ భేటి ఉందని కబురు వచ్చింది. తొలి సమావేశం కాబట్టి అంతా కొత్త ఉత్సాహంతో సీఎం ఇంటికి వెళ్లారు. కుశల ప్రశ్నలు ..కులాసా కబుర్లు తర్వాత మంత్రులకు బాధ్య‌త అప్ప‌గిం చారు. ఒక్కో మంత్రికి ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గం అప్పగిస్తున్నాననీ.. అందులో ప్రస్తుతం ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు.. పునర్విభజన తర్వాత ఏర్పడే రెండింటితో కలుసుకుని తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మంత్రిదేనని స్పష్టం చేశారు.

వారిని గెలిపించడంతో పాటు మంత్రి కూడా గెలిచి రావాలని ఆదేశాలిచ్చారు. దీంతో ఒక్కసారిగా కొత్త మంత్రుల‌ గొంతులో వెల‌గ‌పండు ప‌డిన‌ట్ట‌యింది.  ఎమ్మెల్యేలందరినీ మూడు కేటగిరిలుగా విభజిస్తున్నట్టు వారికి వివరించారు. మొదటి కేటగిరిలో గెలిచేవాళ్లు.. రెండో కేటగిరిలో చెబితే విని ..పొరపాట్లు సరిదిద్దుకుని విజయం సాధించేవారు…మూడో కేటగిరిలో చెప్పినా వినకుండా వ్యవహరిస్తున్న వాళ్లను ఉంచారు చంద్రబాబు.. మూడో కేటగిరి వాళ్లను నిర్దయగా.. నిస్సంకోచంగా తొలగించాలనే విషయాన్ని చెప్పారు. నియోజకవర్గాలు ప్రకటించిన వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించారు. సమావేశం నుంచి బయటకు వచ్చిన కొత్తమంత్రుల ముఖాలు డీలా పడ్డాయి.

ఇది సినిమా విడుదలకు ముందు ట్రయిలర్‌ మాత్రమే.. ఫుల్‌లెంగ్త్‌ షో ముందుంటుందని పాత మంత్రులు చల్లగా చెప్పడంతో ఆశ్చర్యపోవడం కొత్త మంత్రుల వంతయ్యింద‌ట‌. ఆ తర్వాత జరిగిన క్యాబినెట్‌ మీట్‌లో కూడా శాఖలపై పట్టు సాధించాలని కొత్త మంత్రులకు క్లాస్‌ తీసుకున్నారు చంద్రబాబు. మొదటి రోజే కొత్త బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేయటంతో మంత్రులకు పదవి వచ్చిందనే ఆనందం కంటే, ముందున్న బాధ్యతలే పదే పదే గుర్తుకు వస్తున్నాయ‌ట‌.