చంద్రబాబు ప్రభుత్వానికి పవన్ హెచ్చరికలు

ప్ర‌జాక్షేత్రంలోకి జ‌న‌సేన‌ను తీసుకెళ్లేందుకు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌ సిద్ధ‌మ‌య్యారు. టీడీపీ ప్ర‌భుత్వంతో అమీతుమీకి సిద్ధ‌మ‌వుతున్న ఆయ‌న మరో అడుగు ముందుకేశాడు. జ‌న‌సేనాని మ‌రోసారి గ‌ర్జించాడు. టీడీపీ ప్ర‌భుత్వానికి అల్టిమేటం జారీచేశాడు. ప్ర‌భుత్వ తీరుపై నిప్పులు చెరిగాడు. కిడ్నీ స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌కుంటే ప్ర‌జా ఉద్య‌మం లేవ‌దీస్తాన‌ని ప్రభుత్వాన్ని హెచ్చ‌రించాడు. శ్రీ‌కాకుళం జిల్లాలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌టించారు.

ఉద్దానం సహా 11 మండలాల్లో కిడ్నీ వ్యాధి స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించ‌క‌పోవ‌డంపై నిప్పులు చెరిగారు. దీనిని ఘోర విపత్తుగా పేర్కొన్నారు. వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని విమ‌ర్శించారు. కనీసం కారణాలను కనిపెట్టే ప్రయత్నం చేయలేకపోవడం గర్హనీయమని ఆరోపించారు. పుష్క‌రాల కోసం కోట్లు కుమ్మ‌రిస్తున్నార‌ని, రాజ‌ధాని నిర్మాణం కోసం లెక్క‌లేనంత వెచ్చిస్తున్నార‌ని కానీ కిడ్నీ బాధితుల వైపు మాత్రం క‌న్నెత్తి చూడటం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. జనసేన ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కిడ్నీ బాధితులతో మాట్లాడారు.

ఏళ్లుగా కొనసాగుతున్న మరణాలపై కనీసం ఇక్కడి ప్రజాప్రతినిధులైనా మాట్లాడకపోవడం, పరిష్కార మార్గాలపై దృష్టిసారించకపోవడం దారుణమ‌న్నారు. ఉద్దానం సహా ఇతర మండలాల్లో కిడ్నీ వ్యాధులకు గురైనవారిని ప్రభుత్వం ఆదుకోవాలని, తక్షణమే ఒక కమిటీని ఏర్పాటుచేసి ఆర్థిక, ఆరోగ్య ప్యాకేజీలు ప్రకటించాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.

`మేం రిపోర్టు ఇచ్చిన 15 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించాల‌ని…ప్ర‌భుత్వం బాధితుల‌కు ఏం చేస్తుందో 48 గంటల్లో చెప్పాల‌ని…. లేకుంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని చేపడతం` అని ప్రకటించారు. ‘కిడ్నీ రోగుల కోసం డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటుచేశాం’ అంటూ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు గతంలో చేసిన వ్యాఖ్యలపై పవన్‌ మండిపడ్డారు. డయాలసిస్‌ అనేది చికిత్సకాదన్న ఇంగితం మంత్రికి లేదా? అని ప్రశ్నించారు.