జక్కన్న TJ రివ్యూ

సినిమా :జక్కన్న

టాగ్ లైన్:ఇది పెద్ద తిక్కన్నా

TJ  రేటింగ్ :0.5/5

చూసిన థియేటర్: మల్లికార్జున  కూకట్ పల్లి
నటీనటులు:సునీల్, మన్నార్ చోప్రా, కబీర్ సింగ్, సప్తగిరి, పృథ్వీ, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, ప్ర‌భాస్ శీను తదితరులు
బ్యానర్ – ఆర్ పి ఏ క్రియేషన్స్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్,
మ్యూజిక్: దినేష్,
ఆర్ట్ డైరెక్టర్ – మురళి,
ఫైట్స్: కనల్ కణ్ణన్, డ్రాగన్ ప్రకాష్,
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ,
డైలాగ్స్: భవాని ప్రసాద్,
నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డి,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ అకెళ్ళ.

కమెడియన్ సునీల్ హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇన్నాళ్లు ఏవేవో సినిమాలు చేస్తూ వచ్చిన సునీల్ జక్కన్న తో ఓ రెండుగంటల పాటు ప్రేక్షకులపై దండయాత్ర చేసాడు. అసలెందుకొచ్చాం రా దేవుడా ఈ సినిమాకి అనుకోని ప్రేక్షకుడు ఉండడేమో అంతలా నరకయాతనకి గురిచేస్తుంది ఈ సినిమా. నరకానికి మనచేతే స్పెల్లింగ్ రాయించి దాన్ని మనచేతే రెండుగంటలపాటు దిద్దించి కంఠస్తం చేయిస్తే ఎలా ఉంటుందో అలా ఉందీ జక్కన్న.

ఓ వైపు రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడని మనం డప్పులుకొడుతుంటే అదే రాజమౌళికి మరో పేరైన జక్కన్న టైటిల్ తో మనముందుకొచ్చాడు సునీల్.బాహుబలితో జక్కన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగోడి సత్తాని నిరూపిస్తే ఈ సునీల్ జక్కన్న మాత్రం ఇదిగో మా రేంజ్ ఇంతే అంటూ తెలుగు సినిమాని చీల్చి చెండాడి ప్రేక్షకుడికి పెద్ద పరీక్షే పెట్టాడు.టికెట్ కొన్నాక చూడక తప్పదు అని సినిమా చివరి రీల్ వరకు థియేటర్ లో కూర్చోవడమే తప్పితే కనీసం ఏ ఒక్క సన్నివేశంలోనూ ఈ సీన్ పర్లేదు అనేటట్లు లేదు.

మనకి మంచి చేసిన వాళ్ళకి తిరిగి మంచి చెయ్యాలి అనే కాన్సెప్ట్ ని మనకు హెల్ప్ చేసిన వాళ్ళకి తిరిగి హెల్ప్ చేస్తూ టార్చర్ చూపెట్టడమే ఈ జక్కన్న పని. వైజాగ్ లో ఎవ్వరికి కనపడని బైరాగి అనే రౌడీ ని ఎప్పుడో చిన్నప్పుడు జక్కన్నకు అనుకోకుండా చేసిన హెల్ప్ కి తిరిగి ఎలా హెల్ప్ చేసి మనల్ని టార్చర్ చేసాడన్నది కథాంశం. అసలు ఇందులో కథగురించి మాట్లాడుకుంటే అది పెద్ద బూతు. కథనం..స్క్రీన్ ప్లే లాంటి వాటి గురించి అసలు మాట్లాడుకోకపోవడమే మంచిది.

సునీల్ ఎంత హీరో అయినా..సునీల్ సినిమా అనగానే సగటు ప్రేక్షకుడు కామెడీ ఆశిస్తారు. అయితే ఇందులో మనకు మనమే గిలిగింతలు పెట్టుకున్నా ఎక్కడా నవ్వు రాదు. సప్తగిరి,పృద్వి లాంటి కమెడియన్స్ ఉన్నా అన్నీ వాడిపోయిన పంచులు..అరిగిపోయిన సీన్లే తప్ప ఎక్కడా కామెడీ మచ్చుకైనా కనిపించదు. ఇక సునీల్ హీరోయిజమ్ బాబోయ్ అని బిత్తరపోయే రేంజ్లో ఉంటుంది. అసలు సునీల్ హీరోయిజమ్ చుపిస్తున్నాడో,కామెడీ చేస్తున్నాడో అర్థం కాక తల పట్టుకోవాలి. హీరోయిన్ పాటలతో కాలక్షేపం చేస్తుంది పాపం.

ఇక విలన్ గా జిల్ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన కబీర్ సింగ్ ఈ సినిమా కష్టాలు మామూలువి కాదు.అంత సీరియస్ ఎక్సప్రెషన్ తో,బీభత్సమైన బేస్ వాయిస్ తో వుండే కబీర్ సింగ్ పాపం ఎప్పుడు సీరియస్ గా ఉండాలో ఎక్కడ కామెడీ చెయ్యాలో తెలీక పడ్డ వేదన వర్ణనాతీతం.ఇక ఎప్పుడు ఏ సీన్ వస్తుందో..సీన్ అయ్యాక అది కామెడీనా,ఎమోషన్ ఆ,ట్రాజెడీ నా అని ప్రేక్షకుడి ఇంటెలిజెన్స్ కి పరీక్షలా ఉంటుంది సినిమా ఆద్యంతం.

సునీల్ కామెడీ చేస్తే హాయిగా ఉండేది. అదే సునీల్ హీరోయిజమ్ చిపించినా పర్లేదులే అని నెట్టుకొచ్చేశాము. అయితే ఇందులో ఓ వైపు కామెడీ..ఇంకోవైపు హీరోయిజమ్ మిక్సీలో వేసి మిక్స్ చేసి షేక్ చేసి చూపిస్తుంటే చూస్తున్న ప్రేక్షకుడికి కోపం.. విసుగు, బాధ.. భయం అన్నీ ఒక్కసారిగా చుట్టుముడతాయి.డిజాస్టర్ సినిమాలు చూసాం కానీ జక్కన్న డిజాస్టర్లకే డిజాస్టర్. ఈ సినిమాని ఎంత తొందరగా చూసి మరచిపోతే ప్రేక్షకుల ఆరోగ్యానికి అంతమంచిది.