జగన్ తప్పుడు నిర్ణయం… అక్కడ టీడీపీ గెలుపు పక్క అంటున్న వైసీపీ క్యాడర్

నంధ్యాల ఉప ఎన్నిక‌లో పోటీచేయాల‌ని పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ తీసుకున్న‌ నిర్ణ‌యంతో వైసీపీ నేత‌లు అయోమ‌యంలో ప‌డిపోతున్నారు. పైకి చెప్ప‌లేక పోయినా.. లోలోప‌లే తీవ్ర మ‌థ‌న ప‌డుతున్నారు. అంతేగాక ఉన్న కాస్తో కూస్తో క్యాడ‌ర్ కూడా టీడీపీ వైపు వెళ్లిపోవ‌చ్చ‌నే అనుమానాలు వ్య‌క్తంచేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక పార్టీకి లాభించ‌క పోగా… న‌ష్టం క‌లిగించ‌వ‌చ్చని ఆందోళ‌న చెందుతున్నారు. సానుభూతి ప‌వ‌నాలు వీస్తున్న వేళ‌, టీడీపీ గురించి కాక‌పోయినా త‌మ నాయ‌కుడి కుటుంబానికి వ్య‌తిరేకంగా ఎలా ప్ర‌చారం చేయాలా? అని పార్టీ నాయ‌కులు తీవ్రంగా టెన్ష‌న్ ప‌డుతున్నారు!!

భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో నంధ్యాలలో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. వైసీపీ గెలిచిన భూమా నాగిరెడ్డి.. టీడీపీలో చేర‌డంతో ఇప్పుడు చిక్కొచ్చి ప‌డింది. భూమా త‌మ పార్టీ టిక్కెట్‌పై గెలిచాడు క‌నుక నంధ్యాల వైసీపీ సొంత‌మని ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ చెబుతున్నారు. చివ‌రి నిమిషంలో పార్టీ కండువా క‌ప్పుకున్నాడు క‌నుక అది టీడీపీదే న‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు అక్క‌డ ఎవ‌రు నిల‌బ‌డతారు, ఎవ‌రు గెలుస్తార‌నే చ‌ర్చ ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ప్ర‌స్తుతం అక్క‌డ క‌చ్చితంగా పోటీకి దిగుతామ‌ని చెప్ప‌డాన్ని పార్టీ నాయ‌కులే జీర్ణించుకోలేక‌పోతున్నారు.

భూమాకు నంధ్యాల‌లో పార్టీల‌కు అతీతంగా అభిమానులు ఉన్నారు. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన స‌మ‌యంలో కొంత‌మంది నాయ‌కులు.. వైసీపీలోనే ఉండిపోయారు. ప్ర‌స్తుతం ఉప ఎన్నిక జ‌రిగితే.. సానుభూతి ప‌వ‌నాలు ఎక్కువ‌గా వీచే అవ‌కాశం ఉంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ ఆయ‌న వెనుక నిలిచామ‌ని.. ఇప్పుడు ఆయ‌న‌ కుటుంబానికి వ్య‌తిరేకంగా ఎలా ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని కొంత‌మంది నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. అయినా ఇటువంటి స‌మ‌యంలో పోటీ టీడీపీ- వైసీపీ మ‌ధ్యే ఎక్కు వ‌గా ఉన్నా.. వైసీపీ వైపు ప్ర‌జ‌లు మొగ్గుచూపే అవ‌కాశాలు లేవ‌ని స్ప‌ష్టంచేస్తున్నారు.

అధినేత జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల భ‌విష్య‌త్తులో పార్టీకి న‌ష్టం జ‌ర‌గ‌వచ్చ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఉప ఎన్నిక‌ల్లో భూమా కుటుంబం నుంచి ఎవ‌రైనా నిల‌బ‌డితే వారి గెలుపు లాంఛ‌న‌మే అవుతుంది. దీంతో టీడీపీ గెలిచిన‌ట్టే అవుతుంది. వైసీపీ ఓట‌మితో పార్టీ నుంచి మ‌రింత మంది టీడీపీ వైపు మొగ్గు చూపే అవ‌కాశాలున్నాయనే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. పోటీ చేస్తామ‌ని ఆవేశంగా ప్ర‌క‌టించినా.. ముందు చూపుతో ఆలోచిస్తే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని, ఇప్ప‌టికైనా ఈ నిర్ణ‌యం వెన‌క్కు తీసుకోవాల‌ని క్యాడ‌ర్ కోరుతోంది.