టీడీపీ లో ఎమ్మెల్సీ సెగ…బాబును టార్గెట్ చేసిన కేఈ

ఏపీలో అధికార టీడీపీలో ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక అసంతృప్తి సెగ‌లు రాజేసింది. చంద్ర‌బాబు సామాజిక, ప్రాంతాల వారీగా కొంత వ‌ర‌కు స‌మ‌తుల్య‌త పాటించినా చాలా జిల్లాల్లో ఈ అసంతృప్తి జ్వాల‌లు మాత్రం తీవ్రంగానే ఎగ‌సిప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబుతో ఎప్ప‌టి నుంచో అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోన్న డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణ‌మూర్తి మ‌రోసారి త‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

త‌న త‌మ్ముడు, మాజీ ఎమ్మెల్యే కేఈ ప్ర‌భాక‌ర్‌కు ఎమ్మెల్సీ సీటు ఇవ్వ‌క‌పోవ‌డంతో కేఈ చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న అనంత‌పురం జిల్లాలో జేసీ కుటుంబానికి మూడు సీట్టు ఇవ్వ‌డంపై కూడా ఫైర్ అయ్యారు. అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చారని, తన తమ్ముడికి ఎమ్మెల్సీ టికెట్ ఎందుకు ఇవ్వలేదని కేఈ ప్రశ్నించారు.

అనంత‌పురం ఎంపీగా జేసీ దివాక‌ర్‌రెడ్డి, తాడిప‌త్రి ఎమ్మెల్యేగా ఆయ‌న సోద‌రుడు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఉండ‌గా తాజా ఎమ్మెల్సీ సీట్ల‌లో ప్ర‌భాక‌ర్‌రెడ్డి అల్లుడు గుణ‌పాటి దీప‌క్‌రెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. దీనిని బేస్ చేసుకుని కేఈ చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇక ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తిసారి తాను త‌న సోద‌రుడు ప్ర‌భాక‌ర్‌కు స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నాన‌ని కూడా ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇక రాయ‌ల‌సీమ‌లో బీసీల‌కు ఒక్క ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వ‌లేద‌ని విమ‌ర్శించిన కేఈ క‌ర్నూలు ఎంపీ టిక్కెట్టు త‌మ కుటుంబానికి ఇస్తే అక్క‌డ త‌ప్ప‌కుండా టీడీపీ గెలుస్తుంద‌న్నారు. మ‌రి కేఈ వేసిన ఈ ప్ర‌శ్న‌లకు చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.