నాన్నకు ప్రేమతో అంటున్న రాంచరణ్

మెగా అభిమానులంతా చిరంజీవి 150వ సినిమా ఫస్ట్ లుక్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను టైటిల్‌తో పాటే ఈనెల 22న విడుదల చేసేందుకు నిర్మాత, చిరు తనయుడు రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారు. చెప్పిన తేదీకే పక్కాగా ఫస్ట్‌లుక్ వచ్చేస్తుందని తెలుపుతూ, చరణ్ ఇటీవలే ఓ ప్రీ లుక్‌ను కూడా విడుదల చేశారు.

చిరు పుట్టినరోజున పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్న ఫస్ట్‌లుక్‌కు భారీ క్రేజ్ వచ్చేలా రామ్ చరణ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అనౌన్స్ అయిన రోజునుంచే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దానికి తగ్గట్టే సినిమా అభిమానులందర్నీ ఆకట్టుకునేలా ఉండేలా టీమ్ ప్లాన్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా రైతుల సమస్యలు, వారి భూములను కార్పోరేట్ సంస్థలు ఎలా చేజక్కించుకుంటున్నాయి? అన్న అంశాలను డీల్ చేస్తుంది.