బాంగ్లా భద్రతాదళాలు భళా

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంట్‌లో  జరిగిన ఉగ్రవాద దాడిలో ముష్కరులపై ఆ దేశ పోలీసులు పైచేయి సాధించారు. విదేశీయులను హత్య చేయడమే ప్రధాన లక్ష్యంగా బరితెగించిన ఉగ్రవాదులు అక్కడి హోలి ఆర్టిసాన్ రెస్టారెంట్ లోకి చొచ్చుకెళ్లారు. బేకరిలోకి రాగానే కాల్పులకు దిగిన ఉగ్రవాదులు బంగ్లా పోలీసులకు పెను సవాల్ విసిరారు. అయితే వేగంగా స్పందించిన బంగ్లా ఉన్నతాధికారులు ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ ను రంగంలోకి దించారు. ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ దెబ్బకు ఉగ్రవాదులు బెంబేలెత్తిపోయారు.ఈ ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఆపరేషన్ ప్రారంభమైనట్టు అధికారులు ప్రకటించారు. రెస్టారెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న కమాండోలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఇరువురి మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. లోపలికి చొచ్చుకెళ్లిన భద్రతా సిబ్బంది ఉగ్రవాదుల చెరలో ఉన్న వారినుంచి 18 మందిని రక్షించగలిగారు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య సాగిన భీకర కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాదిని బెటాలియన్ సజీవంగా పట్టకుంది. బేకరీలో మరో నలుగురు ఉగ్రవాదులున్నట్లు సమాచారం వీరిని మట్టుబెట్టేందుకు బెటాలియన్ తీవ్రంగా యత్నిస్తోంది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. మరో ఇరవైమందికి గాయాలయ్యాయి. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ లో విదేశీయులు, అల్పసంఖ్యాక మతస్థులు, లైకికవాదులపై దాడులు పెరిగిపోయాయి. శుక్రవారం నాడు ఓ దేవాలయంలో పూజ చేసేందుకు సిద్ధమైన పూజారిని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన మరువక ముందే ఈరోజు అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. సత్‌ఖిరా జిల్లాలోని బ్రహ్మరాజ్‌పూర్ గ్రామంలోని శ్రీశ్రీ రాధా గోవింద ఆలయంలో 48 ఏళ్ల పూజారి బాబా సింధురాయ్‌పై దాడి జరిగింది. ఏడుగురు దుండగులు ఒక్కసారిగా అతడిపై దాడి చేసి అతని పొట్ట, వీపులో విచక్షణారహితంగా పొడిచారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పూజారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అంతకుముందు  జినదై జిల్లాలో ఒక హిందూ పూజారిని నరికిచంపారు. 2013 నుంచి బంగ్లాదేశ్ లో అనేకమంది మతోన్మాదుల చేతుల్లో బలయ్యారు.

ఈ ఘటనపై సిరియా(ఐఎస్ఐఎస్) తో పాటు ఆల్ కాయిదా కూడా వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. ఢాకాలో భీకర దాడి చేసి 20 మంది చంపేశామని ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు.  ఆల్ కాయిదా ఉగ్రావాద సంస్థ నుంచి కూడా మరో ప్రకటన వెలువడింది. ఢాకాలో విరుచుకుపడింది తామేనని ఆ సంస్థ పేర్కొంది.