బాబుకు ఓపెన్ షాక్ ఇచ్చిన వైకాపా ఎమ్మెల్యే

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది! దాదాపు రెండున్న‌రేళ్ల ప‌ద‌వీ కాలంలో క‌నీసం రెండు వేల బ‌హిరంగ స‌భ‌ల్లో ఆయ‌న పాల్గొని ఉంటార‌ని ఓ అంచ‌నా ఉంది. అలా అన్ని స‌భ‌ల్లోనూ పాల్గొన్నా ఆయ‌న ఏనాడూ కంగు తిన‌లేదు స‌రిక‌దా.. ఆయ‌న మైకుకి, ఆయ‌న మాట‌కు ఎదురు లేకుండా పోయింది! అయితే, అన్ని రోజులూ ఒకేలా ఉండ‌వు క‌దా! అలాగే అన్ని స‌భ‌లూ కూడా ఒకేలా ఉండ‌వు! బ‌హుశ ఈ విష‌యాన్ని బాబు ఊహించి ఉండ‌రు. అందుకే ఆయ‌న ఊహించ‌ని విధంగా షాక్ తిన్నారు. అది కూడా ఆయ‌న వైర‌ల్ పార్టీ.. వైకాపా నేత నుంచి! అదేదో జ‌గ‌న్ అనుకుంటే పొర‌పాటే.. ఓ సాధార‌ణ ఎమ్మెల్యే నుంచి చంద్ర‌బాబుకు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది.

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ బహిరంగ సభను ఏర్పాటు చేసి, ఆ సభలో ముఖ్యమంత్రితో పాటు పలువురికి మాట్లాడే అవకాశం కల్పించారు. అయితే పద్ధ‌తి ప్రకారం చంద్రబాబు స్థానిక వైకాపా ఎమ్మెల్యే ఐజయ్యను వేదిక మీదకు పిలిచి మాట్లాడమని చెప్పారు. అయితే వేదిక మీద రాజకీయం చేయవద్దని, ప్రజలకు శుభాకాంక్షలు చెప్పమని సూచిస్తూ.. ఆ ఎమ్మెల్యేకు మైక్ ఇచ్చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ప్రాజెక్టుల విష‌యంలో గ‌త కొన్నాళ్లుగా.. మొత్తం క్రెడిట్ చంద్ర‌బాబు త‌న ఖాతాలోనే వేసుకుంటుండ‌డం పునాదులు వేసిన‌వాళ్ల‌ను మ‌రిచిపోతుండ‌డంపై ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్న వైకాపా వ‌ర్గం వేడిని ఈ ఎమ్మెల్యే స‌భా ముఖంగా వెళ్ల‌గ‌క్కాడు.

ఈ పథకానికి శంకుస్ధాపన వేసి పనులు మొదలుపెట్టింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డే అంటూ బాంబు పేల్చారు. తాను పాల్గొన్న సభలో వైఎస్ ప్రస్తావన రావటంతో చంద్రబాబు ఖంగుతిన్నారు. సదరు ఎమ్మెల్యే ఏకంగా వైఎస్‌ను కీర్తించటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోయారు. వెంటనే ఐజయ్యను గద్ధించారు. రాజకీయాలు చేయవద్దని, రాజకీయాలు చేయాలంటే తానూ చాలా చేస్తానన్నారు. పునాదులు చాలామంది వేసి వెళ్ళిపోతారని, కానీ డబ్బులు మంజూరు చేసి పథకాన్ని పూర్తిచేయటమే ముఖ్యమన్నారు. ఈ లోపుగానే ఐజ‌య్య మైక్ క‌ట్ అయింది. కానీ, మాట్లాడిన రెండు మాట‌లైనా.. బాబుకి షాక్ ఇచ్చాయ‌ని వైకాపా వ‌ర్గం మురిసిపోతోంది.