బాబు చతురతలో చిక్కుకున్న బీజేపీ.

వ్యూహ ర‌చ‌న‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబును మించిన వారు లేరనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే! మిత్ర ప‌క్షం బీజేపీని కూడా తన చ‌తుర‌త‌తో ఇబ్బంది పెట్టి.. తెలివిగా ప‌నులు చేయించుకుంటున్నారు. ఏపీ బీజేపీ నేత‌లు నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. అవి బీజేపీ అధిష్ఠానానికి ఏమాత్రం చేర‌కుండా చేయ‌డంలో స‌ఫ‌ల‌మ‌వుతున్నారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల టికెట్ల కేటాయింపుల్లోనూ బాబు చ‌తుర‌త‌ బ‌య‌ట‌ప‌డిందట‌. బీజేపీకి టికెట్ ఇవ్వ‌లేద‌నే మాట నుంచి త‌న‌ను కాపాడుకోవ‌డానికి, ఇచ్చినా గెలుపొంద‌లేక‌పోయార‌నే అప‌వాదు బీజేపీపై నెట్టేయ‌డానికి సూప‌ర్ ప్లాన్ వేశారు చంద్ర‌బాబు! విజ‌యం ద‌క్క‌ద‌నే సీటును బీజేపీకి కేటాయించి.. తాను మెల్ల‌గా జారుకున్నారు.

ప్ర‌స్తుతం ఉపాధ్యాయ ప‌ట్ట‌బ‌ద్రుల‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానాన్ని బీజేపీకి కేటాయించారు చంద్ర‌బాబు! దీంతో బీజేపీ నేతలు ఉబ్బిత‌బ్బిబ‌వుతున్నారు. అయితే ఉత్తరాంధ్ర వాసులు మాత్రం బీజేపీని చూసి నవ్వుతున్నారు. ఎందుకంటే .. ఈ స్థానం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న శర్మకు తిరుగులేని ఆదరణ ఉంది. ప్రజా సమస్యలపై ఈ స్థాయిలో ప్రత్యక్ష పోరాటం చేసే… సభలో ప్రస్తావించే నాయకుడు ఇంకొకరు ఉండరని వారి న‌మ్మ‌కం. ఆయ‌నకు మంచి ట్రాక్ రికార్డు ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం.

ఉత్తరాంధ్ర ప్రాంత ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇలా ఏవ‌ర్గాన్ని తీసుకున్నా.. శ‌ర్మ‌కు మంచి పేరు ఉంది. అంతేగాక అంద‌రికీ ఆయ‌న సుప‌రిచితులు. ఆయనకు ఫోన్ చేసి స‌మ‌స్య చెబితే చాలు.. ఇక అది పూర్త‌వ‌దు అనేదే ఉండ‌దు. వినతి పత్రం ఇస్తే బుట్టలో వేసేయడం తెలియదు. సమస్యను పూర్తిగా తెలుసుకుని బాధితులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి  ప్రయత్నించడం ఆయన అలవాటు. దీంతో తమ సమస్యలు తీరాలంటే  శర్మే ఎమ్మెల్సీగా ఉండాలనుకుంటారు. అందుకే ఆయన్నే గెలిపిస్తుంటారు.

శర్మపై గెలవడం కష్టమని తెలిసే టీడీపీ ఆ స్థానం గురించి ఆలోచించలేదు. ఇక్క‌డే చంద్ర‌బాబు త‌న చాతుర్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. తెలివిగా ఆ స్థానాన్ని బీజేపీకి కట్టబెట్టేశారు. పాపం… టీడీపీ-బీజీపీలకు బలం ఉన్న చోట్ల గెలవడం  బీజేపీకి కష్టం. అలాంటిది… శర్మ లాంటి నేతపై పోటీ చేసి గెలవడం బీజేపీ నేతలకు అసాధ్యమనే అంటున్నారు విశ్లేష‌కులు