‘బాహుబలి’కి రాజమౌళి సూపర్బ్‌ ఫినిషింగ్‌

రాజమౌళి ఏం చేసినా అది కొత్తగానే ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడీ క్రియేటివ్‌ డైరెక్టర్‌. ‘బాహుబలి’ సినిమాని రెండు పార్టులుగా తీస్తున్న రాజమౌళి, తొలి పార్ట్‌ని ఇప్పటికే విడుదల చేశాడు. అదే బాహుబలి ది బిగినింగ్‌. రెండో పార్ట్‌ ‘బాహుబలి ది కంక్లూజన్‌’. ఇది ఇంకా నిర్మాణంలో ఉంది. ఇదే ‘బాహుబలి’కి ముగింపు. బిగినింగ్‌ పార్ట్‌తోనే సినీ పరిశ్రమ దృష్టినంతటినీ పూర్తిగా తన వైపుకు తిప్పేసుకున్న రాజమౌళి ఇక ఈ ఎండింగ్‌ పార్ట్‌ కోసం చాలా ప్లాన్స్‌ వేస్తున్నాడట. ఇందులోని ప్రతీ సీన్‌ స్పెషల్‌గా ఉండేవిధంగా ప్లాన్‌ చేస్తున్నాడట. అంతేకాదు దీనిలో నటించే నటీనటుల దగ్గర్నుంచీ, వారి కాస్ట్యూమ్స్‌, లొకేషన్స్‌ అన్నీ సరికొత్తగా ఉండేలా డిజైన్‌ చేయిస్తున్నాడు.

జక్కన్న సృష్టి నుండి వచ్చిన మొదటి అద్భుతం ‘మగధీర’ సినిమా. ఈ సినిమా ఎండింగ్‌లో టైటిల్స్‌ పడేటప్పుడు వచ్చే ‘అనగనగనగా..’ అనే పాటతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు రాజమౌళి. అది అప్పట్లో ఓ గొప్ప ప్రయోగం. తెరకు ముదు, తెరకి వెనకాల ఉన్న ఆర్టిస్టులనందరినీ ఒకే తెరపై చూపించిన ఘనత ఆయనకే దక్కింది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్క టెక్నీషియన్‌ని, ఆర్టిస్టుని తెర ముందుకు తీసుకొచ్చాడు ఆ పాటతో రాజమౌళి. ఇప్పుడు తన కెరీర్‌కే పెద్ద ప్రాజెక్ట్‌ అయిన ‘బాహుబలి’ కోసం కూడా ఇలాంటి ప్రయోగం చేయబోతున్నాడట రాజమౌళి. అయితే ఇది అంతకు మించిన ప్రయోగం అని జక్కన్న టీం చెబుతున్నారు. అదేంటో ఇప్పటికైతే సస్పెన్సే.