ముద్రగడ హెల్త్ బులిటెన్ – కాపు మీటింగ్ – ప్రభుత్వం లో టెన్షన్

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరహార దీక్ష కొనసాగుతుంది. రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వద్ద సోమవారం సాయంత్రం 5గంటలకు డా.రమేష్ కిషోర్, డా.విజయేంద్ర ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ముద్రగడ దీక్ష 105గంటలకు చేరుకుంది. ఇప్పటి వరకూ ఎలాంటి పరీక్షలకు ముద్రగడ అనుమతించలేదని డాక్టర్ల బృందం స్పష్టం చేసింది ముద్రగడ చూసేందుకు బాగానే వున్నా ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలిపారు. ప్రస్తుతం నీళ్లు త్రాగుతున్నారని తెలిపారు. బిపీ కూడా చూపించుకోవడం లేదన్నారు. అయితే రక్త పరీక్షలు చేయడం అత్యవసరమని డాక్టర్లు తెలిపారు. ఫిజికల్ గా బాగున్నట్టు ముద్రగడ కనిపిస్తున్నారని, అయితే నిన్నటి కంటే ఆరోగ్యం క్షీణించిందన్నారు. అలాగే ఆయన సతీమణి పద్మావతి ఆరోగ్యం బాగా క్షీణించిందని , ఆమె పరిస్థితి కాస్తంత ఆందోళనకరంగా వుందని డాక్టర్లు తెలిపారు. ఆమె నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ సలైన్ ఎక్కించుకున్నప్పటికీ, తాను సిలైన్ తీసుకోనని చెప్పడంపై ఆపేశామని, అయితే ఆమె ఆరోగ్యం బాగా క్షీణించడంతో సాయంత్రం నుంచి తిరిగి సలైన్ పెడుతున్నామని డాక్టర్ల బృందం తెలిపింది. పద్మావతి ఆరోగ్యం పై ఆందోళన వుందన్నారు.

మరోవైపు, హైదరాబాద్ పార్క్ హయాత్ లో సోమవారం కాపు ప్రముఖులు సమావేశమైయ్యారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష, కాపు రిజర్వేషన్లు, భవిష్యత్ కార్యాచరణపై కాపు ప్రముఖులంతా చర్చ జరుపుతున్నట్టు తెలుస్తోంది.
ఈ సమావేశంలో రాజకీయ కాపు నేతలు వైఎస్ ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటిరాంబాబు, బొత్స సత్యనారాయణ, సి.రామచంద్రయ్య, పల్లంరాజు, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, కన్నబాబు, తోట చంద్రశేఖర్, చలమశెట్టి సునీల్, అద్దేపల్లి శ్రీధర్, సినీప్రముఖులు దాసరి నారాయణరావు, చిరంజీవి, వివిధ రంగాల కాపు ప్రముఖులు హాజరయ్యారు. కాగా, రాజమండ్రిలో ముద్రగడ దీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో కాపు ప్రముఖులంతా సమావేశం కావడం చర్చనీయాంశమైంది.

ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ వర్గాల్లో వణుకు పుట్టిస్తున్నాయి.ముద్రగడ వ్యవహారం లో చర్చలకు ముందే సానుకూలత చుపుంటే ఈ పరిస్థితి వచ్చేదికాదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.ఇక కాపు హేమాహేమీల మీటింగ్ ఏ పరిణామాలకు దారితీస్తుందో అని చంద్రబాబు విస్లేసిస్తున్నారు.