యూపీలో తండ్రి, కొడుకులు విడిగా పోటీ చేస్తే…రిజల్ట్ ఇదే

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ చీఫ్ నసీమ్ జైదీ షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం యూపీ – ఉత్త‌రాఖండ్ – గోవా -మ‌ణిపూర్‌- పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నా ఇప్పుడు అంద‌రి దృష్టి దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌పైనే ఉంది. ఎన్నిక‌ల వేళ యూపీలో రాజ‌కీయ ప‌రిణామాలు స‌డెన్‌గా మారిపోయాయి.

సీఎం అఖిలేశ్‌, ఎస్పీ అధ్య‌క్షుడు అఖిలేశ్ తండ్రి ములాయం మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వార్ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఎస్పీ నిట్ట‌నిలువునా చీలుతుందా అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక ఎన్నిక‌ల షెడ్యూల్ కూడా వ‌చ్చేసింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో యూపీలో రిజ‌ల్ట్ ఎలా ఉండ‌బోతుంద‌న్న అంశంపై ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు ఏబీపీ – లోక్ నీతి నిర్వ‌హించిన ప్రీ పోల్ స‌ర్వేలో ఆస‌క్తిక‌ర‌మైన రిజ‌ల్ట్ వ‌చ్చింది. ఈ స‌ర్వే రిజ‌ల్ట్ ఇలా ఉంది.

అధికార ఎస్పీలో ఎన్ని లుక‌లుక‌లు ఉన్నా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎన్నిక‌లు జ‌రిగితే ఆ పార్టీనే యూపీలో పెద్ద పార్టీ అవుతుంద‌ని తేలింది. 404 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్పీ చీలిక లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ పార్టీకి 141 నుంచి 151 సీట్లు వ‌స్తాయ‌ని స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ఎస్పీ త‌ర్వాత రెండో స్థానంలో ఉన్న బీజేపీకి 129-130 సీట్లు రానున్నాయి.

బీఎస్పీకి 93 – 103, కాంగ్రెస్ కు 13 – 19 సీట్లు మాత్రమే వ‌స్తాయ‌ట‌.

ఇక ఎస్పీలో చీలిక వ‌స్తే బీజేపీ లాభ‌ప‌డ‌నుంది. అప్పుడు పెద్ద పార్టీ అయిన బీజేపీ 158 – 168 సీట్లు గెలుచుకుంటుంది. ఎస్పీ చీలిక త‌ర్వాత అఖిలేశ్ కూట‌మికి 82-92, ములాయంకు 9-15 సీట్లు వ‌స్తాయ‌ట‌. ఇక ఎస్పీ చీలితే బీఎస్పీ సైతం లాభ‌ప‌డ‌నుంది. అప్పుడు రెండో ప్లేస్‌లో ఉండే బీఎస్పీకి 110 నుంచి 120 సీట్లు వచ్చే వీలుంది. కాంగ్రెస్ 14-20 సీట్ల‌కు ప‌రిమిత‌మ‌వుతుంద‌ట‌.

మూడో వెర్ష‌న్‌లో అఖిలేశ్ కాంగ్రెస్ క‌లిస్తే ఆ కూటమికి 133 నుంచి 143 స్థానాలు దక్కే వీలుంద‌ట‌. ఇక ములాయం కేవ‌లం 2 -8 సీట్ల‌కే పరిమిత‌మ‌వుతాడ‌ట‌. బీజేపీ 138 నుంచి 148 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక.. బీఎస్పీకి మాత్రం105 నుంచి 115 సీట్లు వస్తాయని చెబుతున్నారు.