రాజ్యసభలో ఆప్ నేత వీడియో చిచ్చు

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ వీడియో వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. భగవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన రూల్స్‌ ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికార బీజేపీ, అకాలీదళ్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో ఉభయసభల్లోనూ గందరగోళం తలెత్తింది. సభా కార్యక్రమాలు స్తంభించిపోవడంతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.

భగవంత్ మాన్ తీసిన వీడియో తీవ్రవాదుల చేతుల్లో పడితే బాధ్యత ఎవరిదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి, హరసిమ్రత్ బాదల్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తప్పనిసరిగా దర్యాప్తు విచారించాలని, పార్లమెంట్ కార్యకలాపాలను వీడియో తీయడం వెనుకున్న అసలు ఉద్దేశాన్ని వెల్లడి చేయాలని పట్టుపట్టారు. తన చర్యను భగవంత్ సమర్థించుకున్నారని, మరోసారి ఇలాంటిది పునరావృతమైతే చర్యలు తప్పవని రాజ్యసభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. మరోవైపు స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎదుట హాజరైన భగవంత్ ఈ అంశంపై వివరణ ఇచ్చుకున్నారు.

జీరో అవర్ లో విపక్షాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు చూపించేందుకే వీడియో తీశానని భగవంత్ చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చలు లక్కీ డ్రా మాదిరిగా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. తాను పార్లమెంట్ భద్రతకు భంగం కలిగించలేదని స్పష్టం చేశారు. జీరో అవర్ లో తీసిన వీడియోను భగవంత్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ అంశమే ఆయన్ను వివాదాల్లోకి నెట్టింది.