సోమిరెడ్డి విషయంలో విలన్స్ వీరేనా?

ఏపీ అధికార పార్టీ టీడీపీలో వింత వైఖ‌రి క‌నిపిస్తోంది! ఏ పార్టీ అయినా.. త‌మకు చెందిన సీనియ‌ర్ నేత‌పై విప‌క్షాలు దాడి చేయ‌డం మొదలు పెడితే.. అంతేస్థాయిలో విరుచుకుప‌డ‌డం సాధార‌ణం. కానీ, ఇప్పుడు టీడీపీలో ఉన్న ట్రండ్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. వైకాపా నేత‌లు వ‌రుస పెట్టి.. టీడీపీ సీనియ‌ర్ నేత‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్నా.. తెలుగు దేశం పార్టీ నేత‌లు మాత్రం మాట మాత్రం కూడా మాట్లాడ‌క‌పోవ‌డం అంద‌రినీ విస్తుగొలిపిస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ అధినేత చంద్ర‌బాబు సైతం టీడీపీ నేత‌పై వైకాపా చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేలా ఎలాంటి మౌఖిక ఆదేశాలూ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే..

నెల్లూరు జిల్లాలో టీడీపీ ఒక‌ప్పుడు అండ దండ‌గా ఉన్న ప్ర‌స్తుత ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డిపై వైకాపా నేత‌లు కొన్నాళ్లుగా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. సోమిరెడ్డి రూ.వంద‌ల కోట్ల‌ను విదేశాల్లో పోగు చేశార‌ని వైకాపా నేత‌లు దుయ్య‌బ‌డుతున్నారు. దీనికి ప్ర‌తిగా సోమిరెడ్డి కౌంట‌ర్లు ఇస్తున్నా.. వైకాపా ధాటికి, దాడికి అవి ఏమాత్ర‌మూ ప‌నిచేయ‌డం లేద‌ని తెలుస్తోంది. నిజానికి నెల్లూరు జిల్లా నుంచి మంత్రి నారాయ‌ణ కూడా ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. తోటి జిల్లా ఎమ్మెల్సీ, టీడీపీ సీనియ‌ర్ నేత సోమిరెడ్డిపై ఇలా వైకాపా విరుచుకుప‌డుతుంటే.. ఖండించి, మాట‌ల‌తోనే దండించాల్సిన నేత‌.. మౌనంగా ఉండిపోవ‌డంపై స‌ర్వ‌త్రా ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది.

తెలుగుదేశం పార్టీ అధినేత కూడా సోమిరెడ్డిపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టాల్సిందిగా ఎవరికీ సూచించిన దాఖలాలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సోమిరెడ్డి మాత్రం తన ఒంటరి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇదిలావుంటే, సోమిరెడ్డి వ్య‌వ‌హారంపై ఇప్పుడిప్పుడే స్పందిస్తున్న కొంద‌రు నేత‌లు.. టీడీపీ అధిష్టానం వ్య‌వ‌హార‌శైలిని దుయ్య‌బ‌డుతున్నారు. అధికారంలో లేన‌ప్పుడు సోమిరెడ్డి పార్టీ కోసం ప‌దేళ్లు ఏమీ ఆశించ‌కుండా ప‌నిచేశార‌ని, అలాంటిది ఇప్పుడు వైకాపా రెచ్చిపోయి ఆయ‌న‌పై వ్య‌క్తిగ‌త దాడికి దిగుతుంటే క‌నీసం మాట‌మాత్రం కూడా సాయం చేయ‌రా? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు దీనిపై దృష్టి సారించి.. వైకాపాకు కౌంట‌ర్ ఇస్తారో లేదో చూడాలి