ఆకతాయి TJ రివ్యూ

సినిమా : ఆకతాయి
రేటింగ్ : 2 / 5
పంచ్ లైన్ : ఊరించి ఉసూరుమనిపిస్తాడు

నటీనటులు : ఆశిష్ రాజ్,రుక్సార్ మీర్ ,సుమన్, నాగ బాబు, రాంకీ, రాశి, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణ మురళి, పృద్వీ, శ్రీనివాస్ రెడ్డి.
సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగదారి
సంగీతం : మణిశర్మ
నిర్మాతలు : K.R విజయ్ కరణ్, K.R కౌశల్ కరణ్, K.R అనిల్ కరణ్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: రామ్ భీమన!

ఒక చిన్న సినిమాకి సరికొత్త స్క్రీన్ ప్లే చాలా అవసరం.అంతకు మించి ప్రేక్షకుడు ఊహించని మలుపులు కూడా చిన్న సినిమా విజయానికి కీలకం.అయితే మోతాదుకు మించి మలుపులు..కథకు దోహదపడని మలుపులున్నా ప్రమాదమే.సరిగ్గా అదే జరిగింది ఆకతాయి విషయంలో కూడా.సగం సినిమా తీసాక దర్శకుడుకి సగటు తెలుగు సినిమా రివెంజ్ ఫార్ములా గుర్తొచ్చి మిగతా సంగం స్క్రిప్ట్ రాసుకుని సినిమా పూర్తి చేసినట్టు అనిపిస్తాడు ఆకతాయి.

అద్భుతమైన ఓపెనింగ్ తో మొదలయిన ఆకతాయి అంతే ఆహ్లాదంగా .. సరదాగా సాగిపోతుంది.ఎంతలా అంటే దాదాపు మొదటి అర్ధభాగం అంతా ప్రతి ఒక్కరి మొహం లో నవ్వు కనిపించేటంత.ఇంత భారాన్ని సినిమా మొత్తం మోయడం కష్టమనుకున్నాడో ఏమో దర్శకుడు మనందరికీ తెలిసిన రివెంజ్ డ్రామాకు తెరదించి సెకండ్ హాఫ్ అంతా నీరుగార్చేసాడు.

కథలో కావాల్సినన్ని ట్విస్ట్స్ వున్నాయి.కొంచెం ఆంధ్ర వాలా షేడ్స్ కనిపిస్తాయి.సినిమాలో మెయిన్ ప్లాట్ రెవీల్ అయ్యేంతవరకు స్క్రీన్ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఫ్రెష్ గా అనిపిస్తుంది.ఇక అక్కడినుండి దర్శకుడిలో సగటు తెలుగు రివెంజ్ దర్శకుడు నిద్రలేచి తాండవం చేయడం మొదలుపెట్టినట్టు కనిపిస్తాడు.ఈ మొత్తం సినిమాని రెండు సినిమాలుగా చూడొచ్చు.ఒకటేమో చంద్రశేఖర్ యేలేటి తరహాలో గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే తో ఆహ్లాదంగా సాగిపోయే సరికొత్త సినిమా అయితే మరొకటి రెగ్యులర్ రివెంజ్ డ్రామా.

సుమన్,రాసి దంపతులది అందమైన ఫామిలీ.వారికో జీనియస్ కొడుకు.వాడికో కాలేజీ, ఫ్రెండ్స్..అంతలోనే లవ్..ఇలా అందంగా ఆనందంగా గడిచిపోతున్న హీరో జీవితం లో అసలు తన తల్లిదండ్రులు వీరు కాదన్న నిజం తెలిసి తెలియగగానే వారు చనిపోవడం..దానివెనుకున్న కుట్రేమిటి ఇంతకీ తానెవరు..వీరి చావుకు హీరో ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడన్నదే కతఅంశం.

కథలో కావాల్సినన్ని ట్విస్ట్స్ వున్నాయి.అయితే రివెంజ్ డ్రామాని సరిగ్గా హేండిల్ చేయలేక పోయాడు దర్శకుడు.ఒక సారి సస్పెన్స్ రెవీల్ అయ్యాక ప్రేక్షకుడిని సెకండ్ హాఫ్ అంతా కూర్చోబెట్టే స్క్రీన్ ప్లే కానీ దానికి తగ్గ కంటెంట్ కానీ దర్శకుడి దగ్గర కరువయ్యింది.దీన్ని ఓవర్ కం చెయ్యడానికి శ్రీనివాస్ రెడ్డి,బ్రహ్మానందం లని కథలో ఇరికించే ప్రయత్నం చేసినా అవి ప్యాచ్ లు గానే మిగిలిపోయాయి.ప్రేక్షకుడి ఊహకందకూడదనో ఏమో అవసరం లేకపోయినా హీరో బాబాయ్ ని,ఫ్రెండ్ ని చంపేస్తుంది కథ.మాఫియా..పాకిస్థాన్ తీవ్ర వాదులు కలిసి చేసే మిషన్ అయితే మరీ హాస్యాస్పదం దాన్ని హీరో భగ్నం చేసే తీరయితే పెద్ద జబర్దస్త్ ఎపిసోడ్.

హీరో గా నటించిన ఆశిష్ రాజ్ పడుతూ లేస్తూ పర్లేదనిపించాడు.హెరాయిన్ గ్లామర్,నటన యావరేజ్ గా వున్నా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది.సుమన్,రాశి కథలో కీలక పాత్రల్లో న్యాయం చేశారు.ఇక అలనాటి హీరో రాంకీ హీరో తండ్రిగా పర్లేదు కానీ అతనిపై తీసిన బిల్డ్ అప్ షాట్స్ మరీ అతిగా అనిపిస్తాయి.మిగిలిన వాళ్లలో పృద్వి,పోసాని,నాగబాబు తదితరులంతా పర్లేదనిపించారు.

ఈ సినిమా స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లే చూస్తే చాలా సినిమాల,దర్శకుల శైలి నుండి ఇన్స్పైర్ అయిన తీరు కనిపిస్తుంది.అయితే ప్రాబ్లెమ్ ఏంటంటే పూర్తిగా వేరొకరి పంథాను అయినా అనుసరించాలి,లేకపోతే సొంత బుర్రనయినా నమ్ముకోవాలి.ఆ దారి కావాలి ఈ దారి కావాలి అనుకుంటే చివరికి గోదారే అన్న చందాగా తయారవుతుంది ప్రోడక్ట్.మణిశర్మ సంగీతం గుర్తుపెట్టుకుని స్థాయిలో లేదు.అమీషా పటేల్ ఐటెం సాంగ్ కూడా యావరేజ్ గా వుంది. సినిమాటోగ్రఫీ పర్లేదు.మాటలు బాగున్నాయి.కొన్ని కామెడీ పంచ్లు బాగానే పేలాయి.

ఒక మంచి ఫీల్ తో మొదలయి ఇది కూడా నార్మల్ సినిమానే అనే మోగింపు ఇచ్చిన సినిమా ఆకతాయి.మొదట్లో మురిపించి ఆసక్తి రేకెత్తించి అంతలోనే ఉసూరుమనిపిస్తాది ఆకతాయి.