ఏబిఎన్ రాధాకృష్ణ పై క్రిమినల్ కేసు

April 8, 2019 at 4:49 pm

ఏపీ ఎన్నికల్లో సంచలన కేసు నమోదయింది. చంద్రబాబును ఎలాగైనా గెలిపించేందుకు కుట్రలు పన్నుతున్న ఆంధ్రజ్యోతితో పాటు ఎండి రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదయింది. ఇప్పుడు ఈ కేసు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. చంద్రబాబును గెలిపించేందుకు ఏబీఎన్ ఛానల్ లో తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైసిపి నేత విజయసాయిరెడ్డి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అన్ని కోణాలను పరిశీలించిన పోలీసులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తో పాటు ఎండి రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేయడం సంచలనం రేపుతోంది.

జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ క్రిమినల్‌ కేసు నమోదు అయింది. ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబుకు అనుకూలంగా వైసీపీ అధినేత జగన్ కు వ్యతిరేకంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ వార్తలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో ఈ కేసు నమోదు కావడం పత్రిక వర్గంలో ఆసక్తి కరమైన చర్చకు దారితీస్తుంది. తమకు ఎదురే లేదని ఇష్టారీతిన వ్యవహరిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబుకు ఆయన తోక పత్రిక ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు పోలీసులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారని పలువురు నాయకులు అంటున్నారు.

తనది కాని ‘వాయిస్‌’ను డబ్బింగ్‌ చేసి ఏబీఎన్‌ ఛానల్‌లో పదే పదే ప్రసారం చేస్తూ తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడమే కాకుండా, అసత్య ప్రచారం చేస్తూ.. తెలుగు రాష్ట్రాల ప్రజల మనోభావాలు దెబ్బతీశారంటూ వైసిపి నేత విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయ సలహా అనంతరం పోలీసులు సోమవారం సెక్షన్లు 171సి, 171జీ, 171ఎఫ్, 469,505(2) కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి తొందరలోనే పోలీసులు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.

కాగా.. టీడీపీకి అమ్ముడుపోయిన వేమూరి రాధాకృష్ణ తన వాయిస్‌ అంటూ తనది కాని వాయిస్‌ను తన చానల్‌లో ప్రసారం చేయడంతో పాటు తన పత్రికలోనూ ప్రచురించి తన పరువు తీశారని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాధాకృష్ణపై ఐపీసీ సెక్షన్‌ 120 (బి), సెక్షన్‌ 153 (ఏ), 171(సి) 171(హెచ్‌), 420, 123,125 రిప్రజెంటేషన్‌ పీపుల్స్‌ యాక్ట్‌ 1951 కింద క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో ఆయన కోరారు.

ఏబిఎన్ రాధాకృష్ణ పై క్రిమినల్ కేసు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share