శశికళకు భారీ షాక్ … పన్నీరు గూటికి పలువురు ఎమ్మెల్యేలు

తమిళనాడులోనే అతిపెద్ద పార్టీలలో ఒకటైన అన్నాడీఎంకే రెండున్న‌ర ద‌శాబ్దాల త‌ర్వాత భారీ చీలిక దిశ‌గా వెళుతోంది. ద‌క్షిణాదిలో పెద్ద రాష్ట్రాల‌లో ఒక‌టి అయిన తమిళ‌నాడు రాజ‌కీయాల్లో ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన ఈ పార్టీని 1972లో ఎంజీ రామచంద్రన్ స్థాపించారు. ఎంజీఆర్ త‌ర్వాత ప్ర‌ముఖ సినీన‌టి జ‌య‌ల‌లిత ఈ పార్టీని రెండున్న‌ర ద‌శాబ్దాల పాటు త‌న క‌నుసైగ‌ల‌తో న‌డిపించారు.

గ‌తంలో ఎంజీఆర్ చ‌నిపోయిన‌ప్పుడు రెండు వ‌ర్గాలుగా చీలిపోయిన ఈ పార్టీ ఇప్పుడు మ‌రోసారి భారీ చీలిక ద‌శగా వెళుతోంది. జ‌య‌ల‌లిత మృతి చెంద‌డంతో పార్టీ జ‌య‌కు న‌మ్మిన బంటు ప‌న్నీరు సెల్వం వ‌ర్సెస్ జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ వ‌ర్గాలుగా రెండుగా చీలిపోయింది. శ‌శిక‌ళ‌కు నాలుగేళ్లు జైలు శిక్ష ప‌డ‌డంతో ఆమె పార్టీ త‌ర‌పున సీఎం అభ్య‌ర్థిగా సేలం జిల్లా ఎడ‌ప్ప‌డి ఎమ్మెల్యే పళనిసామిని ప్రతిపాదించారు. ఇది నిజానికి పార్టీలో చాలామందికి మింగుడుపడట్లేదని తెలుస్తోంది.

ప‌ళ‌నిస్వామిపై ఇప్ప‌టికే పెద్ద ఎత్తున అవినీతి ఆరోప‌ణ‌లు ఉండ‌డంతో చాలా మంది ఇప్పుడు అమ్మ‌కు అత్యంత విశ్వాసపాత్రుడు అయిన ప‌న్నీరుసెల్వం అయితేనే క‌రెక్ట్ అంటున్నారు. ఇక గ‌త రాత్రి నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు శ‌శిక‌ళ వ‌ర్గం నుంచి క‌నిపించకుండా పోయారు. వీరు ప‌న్నీరు వ‌ర్గంలో చేరేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక రిసార్ట్స్‌లో ఉన్న వారిలో స‌గం మంది ఎమ్మెల్యేలు కూడా చెన్నై వెళ్లిపోయార‌ట‌.

శ‌శిక‌ళ బెంగ‌ళూరు వెళ్లిన వెంట‌నే చాలా మంది…ఇంకా చెప్పాలంటే స‌గానికి స‌గం మంది ఎమ్మెల్యేలు ప‌న్నీరు సెల్వంను క‌లిసేందుకు రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం. మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు మాత్రం మ‌ద్ద‌తు ఇవ్వాలంటే ఎంత ఇస్తార‌ని రెండు గ్రూపుల‌తోనే భేర‌సారాల‌కు దిగుతున్నార‌ట‌.

శ‌శిక‌ళ అత్యాసే కొంప‌ముంచిందా….

ఎలాగైనా పార్టీపై ప‌ట్టు సాధించాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోన్న శ‌శిక‌ళ అత్యాశ‌కు పోయి వేసిన ఎత్తులే ఆమె కొంప ముంచుతున్నాయ‌న్న టాక్ వ‌స్తోంది. త‌న కుటుంబ స‌భ్యుల‌ను పార్టీలోకి తీసుకువ‌చ్చి వారిని అగ్ర‌స్థానాల్లో కూర్చోపెట్టేందుకు వేసిన ఎత్తులు చాలా మందికి న‌చ్చ‌క‌పోవ‌డంతోనే వారంతా ప‌న్నీరు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్ర‌మంలోనే శ‌శిక‌ళ ఆరోప‌ణ‌లు ఉన్న ప‌ళ‌నిస్వామిని సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డం,  తీవ్ర ఆర్థిక ఆరోపణలున్న తన మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్ట‌డం ఎవ్వ‌రికి న‌చ్చ‌డం లేదు. అసెంబ్లీలో బ‌ల నిరూప‌ణ సాక్షిగా పార్టీ చీలిక పూర్తిగా బ‌య‌ట‌ప‌డ‌నుంది.v