ఆనం, శివ‌ప్ర‌సాద్ యూ ట‌ర్న్ తీసుకున్న‌ట్టేనా

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ తర్వాత సీఎం చంద్ర‌బాబును టార్గెట్ చేసిన నేత‌లు యూ ట‌ర్న్ తీసుకున్నారు. కానీ అక్క‌డ‌క్క‌డా అసంతృప్తులు మాత్రం ఇంకా మిగిలిపోయారు. వీళ్లంతా ఇక పార్టీని వీడ‌టం ఖాయ‌మ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్న త‌రుణంలో వీరంద‌రినీ బుజ్జ‌గించేందుకు స్వ‌యంగా అధినేత రంగంలోకి దిగారు. రెండేళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్న‌ త‌రుణంలో ఇలాంటి అసంతృప్తుల ఇబ్బంది ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని గ్ర‌హించి అల‌క తీరుస్తున్నారు. ఎంపీ శివ‌ప్ర‌సాద్‌, ఆనం వివేకా నంద‌రెడ్డి.. ఇలా అంద‌రినీ త‌న దారికి తెచ్చుకుంటున్నారు. ప్ర‌స్తుతానికి వీరు యూ ట‌ర్న్ తీసుకున్నా.. భ‌విష్య‌త్తులో మ‌ళ్లీ రాంగ్ ట‌ర్న్ తీసుకుంటారేమోన‌నే సందేహాలు వ్య‌క్తంచేస్తున్నారు.

దళితుల సమస్యలపై పట్టింపు లేదని.. అంబేడ్కర్ జయంతి సాక్షిగా ఏపీ సీఎం చంద్ర‌బాబును టార్గెట్ చేసిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్.. ఇప్పుడు సడన్ గా చంద్రబాబుకు ఆత్మీయుడిగా మారిపోయారు. ఇద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవని స్ప‌ష్టంచేశారు. దళితుల సమస్యలపై సీఎంతో గంటా నలభై నిమిషాలు మాట్లాడానని.. సమస్యలు పరిష్కరిస్తామని బాబు చెప్పారని శివప్రసాద్ చెప్పారు. ఇక.. కొంతకాలం క్రితం తమకు పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదన్న ఆవేదనతో బ‌యటికి వెళ్లిపోతామంటూ ఇన్ డైరెక్ట్ గా సిగ్నల్స్ పంపించిన ఆనం కుటుంబం కూడా.. ఇప్పుడు చల్లబడింది.

పార్టీలో తమ సేవలు ఎలా వాడుకోవాలన్నదీ చంద్రబాబుకు తెలుసన్న ఆనం.. పనిలో పనిగా ప్రతిపక్ష నేత జగన్ పై కూడా విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరి తీరు చూస్తే.. చంద్రబాబు బుజ్జగించి మరీ ఆవేశాన్ని చల్లబరిచినట్టే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష నేత జగన్ విస్తృతంగా జనాల్లోకి వెళ్తుండడం.. రైతు దీక్ష పేరుతో కార్యాచరణ ప్రారంభించడంతోనే టీడీపీ నాయకత్వంలో అలజడి మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది. అందుకే అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతను.. స్వయంగా చంద్రబాబు తీసుకున్నారని అంటున్నార‌ట‌.

ప్రస్తుతానికి బాబు మీద గౌరవంతో కామ్ అయిన అసంతృప్తులు.. తర్వాత ఎప్పుడైనా మళ్లీ వాయిస్ మార్చే అవకాశం కూడా ఉందని.. ఇంకొందరు అంటున్నారు. ఏమో గుర్రం ఎగ‌రావ‌చ్చుకదా! ప‌రిస్థితుల‌ను బ‌ట్టి రాజ‌కీయాలు మారిపోతూ ఉంటాయ‌నే దానికి ప్ర‌స్తుతం ఇదొక నిద‌ర్శ‌నం మాత్ర‌మే!!