ఎమ్మెల్సీ రేసులో ఆంధ్రా అంబానీ!

ఏపీ ఎమ్మెల్సీల రేసు స‌రికొత్త పుంత‌లు తొక్కుతోంది! ఇప్ప‌టి వ‌ర‌కు సొంత పార్టీ టీడీపీ, వైకాపా జంపింగ్‌లు, మ‌రోప‌క్క హ‌రికృష్ణ వంటి బంధువ‌ర్గం సీఎం చంద్ర‌బాబుకి ఊపిరి తీసుకోనివ్వ‌డంలేద‌ని అనుకుంటుంటే.. ఇంకో వైపు నుంచి భారీ పారిశ్రామిక వేత్త‌ల నుంచి కూడా పెద్ద ఎత్తున బాబుపై ఒత్తిడి పెరుగుతున్న‌ట్టు తెలుస్తోంది. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీకి అత్యంత సన్నిహితుడైన ఆంధ్రా అంబానీగా పేరున్న ‘మాధవరావు’ ఎమ్మెల్సీ పోస్టు కోసం ప్రయత్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో టీడీపీ కార్య‌క‌ర్త‌గా ప‌నిచేసిన ఈయ‌న త‌ర్వాత వ్యాపార రంగంలో పుంజుకున్నారు.

అంబానీ సోదరులు కలసి ఉన్నప్పుడు వారిద్దరికీ సన్నిహితంగా మెలిగి ఏపీలో ‘రిలయన్స్‌’ సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంధాన కర్తగా పనిచేశారు. త‌ర్వాత ప‌రిణామాల నేప‌థ్యంలో మాధ‌వ‌రాలు ముఖేష్ పంచ‌నే ఉండిపోయారు. ఈ ప‌రిస్థితి మాధ‌వ‌రావు లైఫ్‌ని తిప్పేసింది.  వందల కోట్ల ఆస్తులకు అధిపతి అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న టీడీపీ నుంచి చక్రం తిప్పాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌తంలోనే ఆయ‌న రాజ్య‌స‌భ సీటుకి ట్రై చేశారు. అయితే, అప్ప‌ట్లో సుజ‌నా చౌద‌రికే బాబు మొగ్గు చూప‌డంతో మాధ‌వ‌రావు సైలెంట్ అయిపోయారు.

అయితే, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో తమ వ్యాపారాలకు బాగా విస్తరించాలంటే రాజకీయంగా, అధికారికంగా పలుకుబడి కల ‘మాధవరావు’ను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయిస్తే ఆయన తమ సంస్థకు ఎక్కువ సేవలు అందిస్తారని ‘ముఖేష్‌’ భావిస్తున్నారట. ఈ క్ర‌మంలోనే బాబుపై ఒత్తిడి పెరుగుతోంద‌ని, ఎమ్మెల్సీ సీటును మాధ‌వ‌రావుకి కేటాయించేలా ముఖేష్ చ‌క్రం తిప్పుతున్నార‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే.. ముఖేష్ మాట‌ని బాబు ప‌క్క‌న పెట్టే ప‌రిస్థితి ఉండ‌దు. సో.. మాధ‌వ‌రావుకి సీటు క‌న్ఫ‌ర్మేన‌ని ఓ వ‌ర్గం ఇప్ప‌టికే ప్ర‌చారం ప్రారంభించింది.

అయితే, మాధ‌వ‌రావు మాత్రం ఇలాంటి దేమీ లేద‌ని, త‌న‌కు వ్యాపారాలు చూసుకునేందుకే టైం స‌రిపోవ‌డం లేద‌ని అంటున్నారు.  మ‌రి రాబోయే రోజుల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేళ‌.. బాబు కి సెగ‌బాగానే త‌గులుతోంద‌ని అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు.