ఎవ‌రికి వారేనా.. ఏపీని ప‌ట్టించుకునే వారే లేరా..!

April 29, 2019 at 6:18 pm

దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల కోడ్ అమల్లో ఉంది. అయితే, ఏపీలో మాత్రం ఎన్నిక‌లు ముగిసి రెండు వారాలు గ‌డిచిపోయింది. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు కూడా కోడ్ అమ‌ల్లోనే ఉంటుంద‌ని అధికారులు పేర్కొంటున్నారు. ఫ‌లితాలు వ‌చ్చేందుకు మ‌రో 23 రోజుల‌కు పైగానే ఎదురు చూడాలి. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం ఏర్పాటుతో మ‌రో వారం రోజులు ఎదురు చూడాలి. మ‌రి ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏంటి? ఒక‌ప‌క్క ఎండ‌లు ముదురుతున్నాయి. మ‌రోప‌క్క‌, ఖ‌రీఫ్ కు అదును త‌ప్పే ప‌రిస్థితి కూడా దాపురించింది. వ్య‌వ‌సాయానికి నీరు కావాలి. ఇంకోప‌క్క‌, ప్రైవేటు స్కూళ్ల‌లో అడ్మిష‌న్ల పేరుతో ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు గుంజుతున్నారు. మ‌రి వీట‌న్నింటినీ ఎవ‌రు చూడాలి? అనే ప్ర‌శ్న సాధార‌ణంగానే తెర‌మీదికి వ‌చ్చింది.

సీఎం చంద్ర‌బాబు.. త‌న‌కు అధికారులు అడ్డుప‌డుతున్నార‌ని అంటున్నారు. అయితే, ఎన్నిక‌ల కోడ్ ప‌రిధిలో లేని అధికారుల‌తో ఆయ‌న స‌మీక్ష చేసే అవ‌కాశం, ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. కూడా ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయంగా చూస్తూ.. ప్ర‌తి దానిలోనూ త‌న‌కు ల‌బ్ధి ఉందో లేదో చూసుకుంటున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో ఆయ‌న వివాదాల‌కే ఎక్కువ‌గా అవ‌కాశం ఇచ్చే లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే, రోజుకో రాష్ట్రానికి వెళ్లి త‌న మిత్ర‌ప‌క్షాల‌కు ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో అధికార పార్టీగా టీడీపీ చేస్తున్న‌ది ఏమీ క‌నిపించ‌లేదు. స‌మీక్ష‌లు చేస్తే.. ప‌నులు అవుతాయో.. లేక క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి ప‌నులు చ‌క్క‌బెడితే అవుతాయో ఏలిన వారికే తెలియాలి.

ఇక‌, తానే అధికారంలోకి వ‌స్తాన‌ని ప్ర‌గాఢంగా విశ్వ‌సిస్తున్న విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ తీరు మ‌రోర‌కంగా ఉంది. ఎన్నిక‌లు ముగియ‌డంతోనే త‌న‌కు ఈ రాష్ట్రంతో సంబంధం లేన‌ట్టుగా వెళ్లి హైద‌రాబాద్‌లో కూర్చున్నారు. వాస్త‌వానికి ఆయ‌న ఇక్క‌డ ప్ర‌తిప‌క్ష నేత‌. మ‌ళ్లీ ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యే వ‌ర‌కు కూడా ఆయ‌నకు ప్ర‌తిప‌క్ష అధినేత‌గానే హోదా ఉంటుంది.మ‌రి ఆయ‌నైనా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై స్పందించాలి. లేదు., వ‌చ్చేది ఎలాగూ త‌న ప్ర‌భుత్వ‌మే కాబ‌ట్టి ఇప్ప‌టికే క్షేత్ర‌స్థాయిలో ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ప‌రామ‌ర్శిస్తే.. మ‌రింత గా ఆయ‌నకు మంచి పేరు వ‌స్తుంది. అయితే, ఆయ‌న ఈ విష‌యాన్ని కూడా ప‌క్క‌కు పెట్టి హైద‌రాబాద్‌లో ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ ఇద్ద‌రి ప‌రిస్థితి ఇలా ఉంటే.. మూడో ప‌క్షం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఏపీ వారిని తెలంగాణ‌లో కొడుతున్నారంటూ..ప్రాంతీయ వాదం రెచ్చ‌గొట్టి మ‌రీ ఓట్ల వేట‌లో ప‌రుగులు పెట్టారు. తీరా ఎన్నిక‌లు ముగియ‌డంతో అదే తెలంగాణ‌లో మ‌కాం వేశారు. కానిస్టేబుల్ కుమారుడికి సీఎం అయ్యే అర్హ‌త లేదా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న కూడా ఇప్పుడు ఏపీలో ఒక్క క్ష‌ణం కూడా ఉండేందుకు, వ‌చ్చేందుకు ఇక్క‌డ ప‌రిస్థితిని ప‌ట్టించుకునేందుకు ఎందుకు ఆస‌క్తి చూపించ‌డం లేద‌నే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. త‌న‌కు ఎన్నిక‌ల‌తో సంబంధం లేద‌ని అన్న ప‌వ‌న్ ఇప్పుడు ఎన్నిక‌ల కోస‌మే అన్న‌ట్టుగా హైద‌రాబాద్‌కే ప‌రిమితం కావ‌డం ఆయ‌న‌కే చెల్లింది. దీంతో ఏపీలో ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకునే నాధుడే క‌రువ‌య్యార‌ని అంటున్నారు సామాన్యులు.

ఎవ‌రికి వారేనా.. ఏపీని ప‌ట్టించుకునే వారే లేరా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share