
ఈ హెడ్డింగ్ చూస్తే కాస్త ట్విస్టుంగుగానే ఉన్నట్లు ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఐదు కేంద్ర మంత్రి పదవులు ఏంటి ? తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లు గెలిచింది… ఏపీలో వైసీపీ ఎన్డీయేలో చేరుతుందా ? అరె అదేంటి జగన్ హోదా అడుగుతున్నాడు.. అందుకే బీజేపీ ఒప్పుకుందా ? మరి ఈ మంత్రి పదవుల కథేంటి ? అన్న సందేహాలు రాకమానవు. ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ మద్దు అన్న నినాదంతోనే జగన్ ఐదేళ్లుగా టీడీపీపై పోరాటం చేశాడు. ఇప్పుడు బీజేపీకి పూర్తి మెజార్టీ రావడంతో ఆ పార్టీ ఇచ్చిన దాంతో సంతృప్తి పడడం లేదా ప్యాకేజీతో సమానమైన నిధులు అయినా నిక్కచ్చిగా రాబట్టుకోవడం మినహా చేసేదేం లేదు.
అలాగని ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జగన్ మోడీకి ఎదురెళ్లే పరిస్థితి కూడా లేదు. అందుకని చాలా చాకచక్యంగా జగన్ కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు నెరపాలని డిసైడ్ అయిపోయాడు. ఈ క్రమంలోనే బీజేపీ జగన్‌ను ఎన్డీయేలోకి చేరాలని చెప్పడంతో పాటు మంత్రి పదవులపై ఆఫర్ కూడా ఇచ్చినట్టు వార్తలు గుప్పుమంటున్నాయ్. జగన్ రైట్ హ్యాండ్ విజయసాయిరెడ్డికి కేబినెట్ ర్యాంకుతో పాటు బాపట్ల ఎంపీ నందిగం సురేష్, జగన్ మరో రైట్ హ్యాండ్ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి సహాయ మంత్రి పదవులు అంటున్నారు. సాయిరెడ్డి పోర్టుల శాఖ అంటున్నారు.
సరే ఏపీలో వైసీపీ నిజంగా ఎన్డీయేలో చేరుతుందా ? అన్నది కాస్త పక్కన పెడితే తెలంగాణలో కిషన్‌రెడ్డికి ఓ శాఖ గ్యారెంటీ. తాను గత ఐదేళ్ల నుంచే కేంద్ర మంత్రి పదవి కోసం కాచుకుని కూర్చొని ఉన్నాడు. ఇక మరో కేంద్ర మంత్రి పదవి ఎవరికి వస్తుందా ? అన్న ఆసక్తి సహజమే. బీసీ కోటాలో అయితే కేసీఆర్ కుమార్తె కవితను ఓడించిన ధర్మపురి అరవింద్‌కు వస్తుంది. కవితను ఓడించిన అరవింద్ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా నేషనల్ పాలిటిక్స్‌లో కూడా హైలెట్ అయ్యాడు.
ఇక కేసీఆర్ స్వయంగా కేంద్ర మంత్రి అంటూ ప్రకటించిన వినోద్‌కుమార్‌ను కరీంనగర్లో ఓడించిన బండి సంజయ్ పేరు కూడా కేబినెట్ రేసులో ఉంది. కిషన్‌రెడ్డికి బెర్త్ పక్కా అయినా … తెలంగాణలో రెండో మంత్రి పదవి ఇచ్చి వచ్చే అసెంబ్లీ ఎన్నికల టైంకు బీజేపీని మరింత బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తే ఇక్కడ రెండు బెర్తులు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇక మోడీ టీఆర్ఎస్ను ఎన్డీయేలో చేర్చుకోరా ? అంటే నో అనే అంటున్నాయి బీజేపీ శ్రేణులు. టీఆర్ఎస్కు ఉన్న 9 సీట్ల కంటే వైసీపీకి ఉన్న 22 ఎంపీ సీట్లే ఎక్కువ. ఇక కేసీఆర్ చివర్లో మోడీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఇతర రాష్ట్రాల్లో కొన్ని పార్టీలకు ఆర్థిక సాయం చేసిన విషయం మోడీ దగ్గర ఫైల్‌గా ఉందట. అది అసలు సంగతి మరీ మోడీ కేబినెట్లో తెలుగు వాళ్లకు ఎన్ని బెర్తులు ఉంటాయో ? చూడాలి.