కేసీఆర్‌కు యాంటీగా యూపీ సీఎం యోగి

తెలంగాణలో రాజ‌కీయం మ‌రింత వేడెక్కుతోంది! నాలుగు రోజుల కింద‌ట బీజేపీ ర‌థ‌సార‌థి అమిత్ షా.. తెలంగాణ‌లో మూడు రోజుల ప‌ర్య‌ట‌న చేయ‌డం, భారీ బ‌హిరంగ స‌భ పెట్ట‌డం, కేసీఆర్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించ‌డం, కేంద్రం ల‌క్ష కోట్ల‌కు పైగానే తెలంగాణ‌కు సాయం చేసింద‌ని చెప్ప‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార‌మే ధ్యేయంగా బీజేపీ నేత‌లు ముందుకు సాగుతుండ‌డం వంటి విష‌యాల నేప‌థ్యంలో ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి.

అంతేనా? తెలంగాణ సీఎం, తెలంగాణ ఉద్య‌మ నేత.. బల‌మైన మాస్ ఇమేజ్ ఉన్న కేసీఆర్‌ను ఎదుర్కోవ‌డంపైనా బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. కేవ‌లం 4.5 కోట్ల మంది ప్ర‌జ‌లున్న తెలంగాణ‌లో పాగా వేసేందుకు ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందు నుంచే బీజేపీ క‌స‌ర‌త్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా కేసీఆర్ హ‌వాను ఎదుర్కొనేందుకు బీజేపీ అగ్ర‌నేత‌లు షా, ప్ర‌ధాని మోడీ స‌హా ప్ర‌స్తుతం దేశంలో ఆక‌ర్ష‌ణీయ సీఎంగా ఉన్న యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌ను రంగంలోకి దింపాల‌ని బీజేపీ నిర్ణ‌యించింద‌ట‌.

ఇదే విష‌యాన్ని తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ ప్ర‌క‌టించారు. అమిత్ షా వ‌స్తేనే అల్లల్లాడిపోతున్న కేసీఆర్‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రధాని మోడీతోపాటు యోగి ఆదిత్య‌నాథ్ కూడా ప్ర‌చారానికి దిగితే ఎలా ఉంటుందో వారే ఊహించుకోవాల‌ని ల‌క్ష్మ‌ణ్ వ్యాఖ్యానించారు. అయితే, అమిత్ షాగానీ ఆదిత్య‌నాథ్ గానీ హిందీలోనే మాట్లాడతార‌నీ, అయినాస‌రే తెలంగాణ‌లో వారి ప్ర‌భావం అనూహ్యంగా ఉంటుంద‌ని ఇప్ప‌ట్నుంచే జోస్యం చెబుతున్నారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఒక్క కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు ఇంత మంది తెలంగాణ‌కి క్యూక‌ట్టాలా? అనేది ఇప్పుడు అంద‌రినీ ఆలోచింప చేస్తున్న ప్ర‌శ్న‌. రాష్ట్రంలో బీజేపీ బ‌లాన్ని కూడా ఇది తేట‌తెల్లం చేస్తోంది. ముఖ్యంగా కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు యోగిని రంగంలోకి దింప‌డం అనేది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి. ఏదేమైనా.. కేసీఆర్ బ‌లాన్ని బీజేపీ బాగానే ఊహించుకుంద‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి. అందుకే.. చతురంగ బ‌లాల‌ను బీజేపీ తెలంగాణ‌లో మోహ‌రిస్తోంద‌నే వాద‌న వ‌స్తోంది. మ‌రి కేసీఆర్ దీనికి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో చూడాలి.