
ఏపీలో ఎదగాలని భావిస్తున్న జాతీయ పార్టీ బీజేపీ.. దానికి అనుకూలంగా కీలక అడుగులు వేస్తోంది. తాజాగా ఆ పార్టీ ఏ పార్టీనీ వదలిపెట్టడం లేదు. ఎవరు వచ్చినా పార్టీలోకి చేర్చుకుంటామని రెండు రోజుల కిందట పార్టీ నాయకుడు సోము వీర్రాజు ప్రకటించిన వెంటనే తెరమీదికి వచ్చిన పేరు వెలం పల్లి శ్రీనివాస్. గతంలో బీజేపీలో చేరి కొన్నాళ్లకు బయటకు వచ్చిన ఆయన ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు వైసీపీ పంచన చేరిపోయారు.
వాస్తవానికి ప్రజారాజ్యంతో ప్రారంభమైన వెలంపల్లి రాజకీయ ప్రస్థానం.. తొలి దశలోనే ఎమ్మెల్యేగా గెలిచేలా చేసింది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆయన సునాయాశంగా విజయం సాధించారు. ఇక, ఆ తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో కొన్నాళ్లు ఊగిసలాడిన ఆయన 2014 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి, ఆ పార్టీ తరఫున పశ్చిమ టికెట్‌ను సంపాదించుకుని పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇక, కొన్నాళ్లకే ఇక్కడ నుంచి గెలిచిన వైసీపీ నాయకుడు జలీల్ ఖాన్ పార్టీ మారడంతో ఆ వెంటనే ఆయన వచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
తాజాగా జరిగిన ఎన్నికల్లో పశ్చిమ నుంచి పోటీ చేసి విజయం సాధించి, జగన్ కేబినెట్లో అదృష్టవశాత్తు.. దేవాదాయ శాఖ మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. అయితే, ఏపీలో రాజకీయాలపై దృష్టి పెట్టిన బీజేపీ పశ్చిమలో వెలంపల్లి తమ గూటికి వస్తే.. తిరుగు ఉండదని భావించింది. ఈ క్రమంలోనే ఆయన మంత్రిగా ఉన్నా కూడా.. ఆయనను ఆకర్షించేందుకు పక్కా స్కెచ్ సిద్ధం చేసుకుంది. పార్టీ మారితే.. మీకు కేంద్రంలో సహాయ మంత్రి లేదా, స్వతంత్ర కోటాలో మంత్రి పదవి ఇస్తామని, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పరిస్థితి అంత సవ్యంగా ఉండదని.. వైసీపీ పరిస్థితి వచ్చే రెండేళ్లలో డౌన్ అవుతుందని… మీరు ఎలాగూ రెండున్నరేళ్లే మంత్రిగా ఉంటారని….. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలని సూచించిందట.
దీనికి సంబంధించి వెలంపల్లికి నేరుగా కేంద్రంలోని జాతీయ నాయకుడు రాం మాధవ్ రెండు రోజుల కిందట నేరుగా పోన్ చేసినట్టు సమాచారం. పార్టీని ముందుకు నడిపించేందుకు సహకరించాలని , కేంద్రంలో స్వతంత్ర హోదాలో మంత్రి పదవి ఇస్తామని, రావాలని ఆహ్వానించారట. ఈ ఆహ్వానంపై ప్రస్తుతానికి మౌనంగా ఉన్న వెలంపల్లి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కనుక వైసీపీకి అనుకూలంగా లేకపోతే.. తప్పకుండా పార్టీ మారేందుకు రెడీ అయ్యేందుకు తాను సిద్ధమేనని సంకేతాలు పంపినట్టు సమాచారం. దీనిని బట్టి వచ్చే రోజుల్లో వెలంపల్లి పార్టీ మార్పు ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.