శాఖల మార్పులతో చిక్కులు తప్పవు..బాబు!

November 10, 2018 at 11:33 pm

చంద్రబాబునాయుడు ఇప్పుడు మంత్రివర్గాన్ని భర్తీ చేయబోతున్నారు. దాదాపు నాలుగునెలలు పదవుల్ని ఖాళీగా పెట్టుకున్న చంద్రబాబు.. మరో నాలుగు నెలల మంత్రి వైభోగం అనుభవించే అవకాశాన్ని ఇద్దరికి ప్రసాదించడానికి సిద్ధపడ్డారు. ఒక్క ముస్లింకు, ఎస్టీకి కూడా పదవి ఇవ్వలేదంటూ ఇన్నాళ్లూ మోసిన నిందను, ఈ ప్రభుత్వ పదవీకాలపు చివరిరోజుల్లో చెరిపేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీటిని భర్తీ చేయడంతో ఆయన ఆగితే అదో రకం, అలా కాకుండా శాఖల మార్పు మొదలెడితే చాలా చిక్కులు వచ్చే ప్రమాదమూ ఉంది.chandra-babu

చంద్రబాబు తన మంత్రి వర్గం లో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయాలని నిర్ణయించడం తెలుగు దేశం పార్టీ లో ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. బాబు కేంద్ర మంత్రి వర్గం నుండి బయటకు వచ్చిన తరువాత, రాష్ట్రం నుండి కూడా బిజెపి సభ్యులు కూడా రాజీనామా చేయడంతో ఏర్పడిన రెండు ఖాళీలను భర్తీ చేయాలనుకున్న బాబు, అందులో ఒక పదవిని ఇటీవలే మావోల చేతిలో హత్య కు గురయిన అరకు ఎంఎల్ఎ కిడారి సర్వేశ్వర రావు కుమారుడు శ్రవణ్ కు, రెండోదాన్ని మైనారిటీ కోటాలో నంద్యాలకు చెందిన సీనియర్ తెలుగుదేశం నేత, ఎన్ యం డి ఫరూక్ హుస్సేన్ కు ఇవ్వాలని నిర్ణయించారు.Chandrababu-Naidu-1

మైనారిటీ కోటా లో మంత్రి పదవి ఆశించి, వైసిపి నుండి తెలుగు దేశం పార్టీ లోకి ఫిరాయించిన విజయవాడ వెస్ట్ ఎంఎల్ఎ జలీల్ ఖాన్, అనంతపురం జిల్లా కదిరి ఎంఎల్ఎ చాంద్ బాషా లకు చివరకు నిరాశే మిగిలింది. పార్టీలో ఉన్న సీనియర్లు, మంత్రి పదివి ఆశిస్తున్న బండారు సత్యనారాయణ, ధూళిపాళ్ళ నరేంద్ర, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గొల్ల సూర్యారావు లాంటి నేతలతో పాటు జూనియర్ లు అయినప్పటికీ, పార్టీ కోసం శ్రమ పడుతున్న తమ కష్టాన్ని గుర్తించి మంత్రి పదవులు ఇస్తారేమోనని ఆశించిన బొండా ఉమామహేశ్వర రావు, కూన రవికుమార్ లాంటి ఎంతో మందికి మంత్రి పదవి ఎండమావే.ap-ministry

మంత్రి పదవులకు పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో శాసన సభ్యులను తెలివిగా పక్కన పెట్టేసిన చంద్రబాబు, మైనారిటీ, గిరిజన కోటా ల క్రింద ఖాళీ ఉన్న రెండు మంత్రి పదవులను శాసనసభ్యులు కాని వారికి ఖరారు చేసినట్లు కనపడుతోంది. అంతే కాక బిజెపి సభ్యుల రాజీనామాలతో ఖాళీ అయిన వైద్య,ఆరోగ్య శాఖ, దేవాదాయ శాఖ లు రెండు కూడా ప్రాముఖ్యమైన శాఖలు కావడంతో ఆ శాఖల కేటాయింపు కూడా చంద్రబాబు కు తలనొప్పి తెచ్చే ప్రమాదం ఉంది. ఇదే చివరి మంత్రి వర్గ విస్తరణ కావడం, ఆశావాహులు ఎక్కువగా ఉండటం, ఎంఎల్ఎ లు ఎవరికీ మంత్రి పదవులు వచ్చే అవకాశం లేకపోవడం తో పార్టీలో నిరసనలు పెరిగే అవకాశం ఉంది.

ఎస్టీ, మైనారిటీ కోటా మాత్రమే భర్తీ చేయడాన్ని సమర్థించుకోగలరు గానీ.. అదే కోటాలో పదవులు ఆశించే ఇతరుల అసంతృప్తుల్ని ఎలా బుజ్జగించగలరో తెలియని సంగతి. ఎన్నికల సమయం దగ్గరగా ఉండటంతో విస్తరణ తో పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ని చల్లార్చి, పార్టీని విజయం వైపు నడపడం చంద్రబాబుకు శక్తికి మించిన పనిగానే కనపడుతోంది. కోటాల పేరుతో ఆశావాహులందరి ఆశలపై నీళ్లు చల్లుతున్న చంద్రబాబు మంత్రాంగం ఏ మేరకు సఫలం కానుందో మరి వేచి చూడాలి.

పైగా ఇప్పుడు భర్తీ ఒక్కటే జరగబోవడం లేదు. కీలకమైన వైద్యఆరోగ్య శాఖను ఇతర సీనియర్లకు అప్పగించే అవకాశం ఉంది. ఆ రకంగా మంత్రివర్గంలో మరికొన్ని మార్పు చేర్పులు జరగవచ్చు. ఇవి ఆయా శాఖల మంత్రులకు అసంతృప్తి కలిగించవచ్చు అనే పలువురు భయపడుతున్నారు. ఈ కేబినెట్ భర్తీ వ్యవహారం కొరివితో తలగోక్కున్నట్లు తయారవుతుందేమో అని కూడా అనుకుంటున్నారు.

శాఖల మార్పులతో చిక్కులు తప్పవు..బాబు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share