మోదీ వాళ్లను నమ్ముతారనుకుంటే భ్రమే!

June 22, 2019 at 12:09 pm

గతిలేక వీళ్లు ఆ పార్టీలోకి వెళుతున్నారు… ప్రస్తుతానికి తమ అవసరం గడుస్తుందని వారు కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు… అంతే తప్ప.. పార్టీ మారుతున్న నలుగురు తెలుగుదేశం రాజ్యసభ ఎంపీలను మోడీ విశ్వాసంలోకి తీసుకుంటారని అనుకుంటే మాత్రం భ్రమే. సాధారణంగా నాయకులు/ ప్రజాప్రతినిధులు పార్టీ మారుతున్న సందర్భాల్లో.. తమ రాజకీయ భవిష్యత్తు దివ్యంగా ఉండడానికి, ఆ ఫిరాయింపు ఉపకరిస్తుందనే ఉద్దేశంతోనే అలా చేస్తుంటారు!

కానీ ప్రస్తుత పరిణామాలను గమనిస్తే.. సుజనా అండ్ కో కు భాజపా భవిష్యత్తులో కూడా రాజ్యసభ ఎంపీలుగా అవకాశం కల్పిస్తుందా? అనేది అనుమానమే. ఒక రకంగా చెప్పాలంటే.. ఇవాళ తెలుగుదేశాన్ని కాలదన్ని పార్టీ వీడిపోతున్న ఈ నలుగురిని.. మోదీ విశ్వాసంలోకి తీసుకుంటారని, తన వారిగా పరిగణిస్తారని కూడా అనుకోవడానికి వీల్లేదు.

ఫిరాయించిన వాళ్లకు ప్రస్తుతం భవిష్యత్తు మీద ఆశ ఉడిగిపోయింది. 23 సీట్లకు పడిపోయిన చంద్రబాబునాయుడు ప్రతిష్ట… మళ్లీ లేచి నిలబడుతుందనే నమ్మకం సన్నగిల్లిపోయింది. రాష్ట్రంలో ప్రస్తుతం వైకాపా ప్రాభవం నడుస్తున్నది గానీ.. జగన్ వీళ్లెవ్వరినీ దరికి రానిస్తారనే నమ్మకం కూడా లేదు. ఏ రకంగా చూసినా రాజకీయ అండదండల కోసం వారు వెంపర్లాడిపోయే పరిస్థితిలో ఉన్నారు. అందుకే భాజపా పంచకు చేరుకున్నారు.

భాజపా పరిస్థితి కూడా రాజ్యసభలో బలం కోసం అర్రులు చాస్తున్నట్లుగా ఉంది. తమ సహజమైన హిందూత్వ ఎజెండాను పరిపాలనలో అమల్లో పెట్టాలంటే… కీలక బిల్లులను చట్టాలుగా దేశంమీదకు వదలాలంటే.. రాజ్యసభలో ఉన్న బలం లేమి వారిని అడ్డుకుంటోంది. ఆ రకంగా.. పెద్దలసభలో బలం పెంచుకోవడం వారికి కూడా చాలా అవసరం. అందుకే విమర్శలు తప్పవని తెలిసినా… ఈ నలుగురి ఫిరాయింపులను వారు ఆహ్వానించారు.

ఉభయులకూ గత్యంతరం లేక జరిగిన ఒప్పందం ఇది. అలాంటప్పుడు.. ఈ నలుగురి పదవులు ఖాళీ అయినప్పుడు… ఏపీ, తెలంగాణల్లో భాజపాకు ఉన్న బలాన్ని నమ్ముకుని వీరు తిరిగి పదవి పొందడం అసాధ్యం. అదే సమయంలో.. భాజపా మరో చోటనుంచి వీరికి అవకాశం కల్పిస్తుందని అనుకోవడం కూడా భ్రమే!

మోదీ వాళ్లను నమ్ముతారనుకుంటే భ్రమే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share