తమ్ముళ్లు మద్దతు ఎక్కడ బాబు ?

May 18, 2019 at 1:58 pm

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు సొంత పార్టీలోనే కీల‌క నేత‌ల నుంచి మ‌ద్ద‌తు క‌రువైందా? నాయ‌కులు ఒక్కొక్క‌రుగా ఆయ‌న‌కు దూరం జ‌రుగుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. నిజానికి చంద్ర‌బాబు ఆ! అంటే.. ఆహా.. అంటూ ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తూ.. బాబు కు భారీ మ‌ద్ద‌తుగా మాట్లాడే నేత‌ల‌కు టీడీపీలో కొద‌వ లేదు. మంత్రులే కాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా చంద్ర బాబు తాన‌.. అంటే తందానా! అనే ర‌కాలు చాలానే ఉన్నాయి. ఫైర్‌బ్రాండ్లుగా పేరు తెచ్చుకున్న విజ‌య‌వాడ‌ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా ఈ జాబితాలో పేరు తెచ్చుకున్నారు. ఇక‌, మంత్రులు య‌న‌మ‌ల‌, కేఈ కృష్ణ‌మూర్తి, అచ్చ‌న్న‌, ఆదినారాయ‌ణ రెడ్డి ఇలా చాలా మంది బాబుకు మ‌ద్ద‌తుగా గ‌ళం వినిపించిన వారే.

అయితే, ఇప్పుడు ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌..చంద్ర‌బాబు చేస్తున్న పోరాటానికి, ఆయ‌న వేస్తున్న పంచ్‌ల‌కు స్పందిం చే నాయ‌కులు పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా ఎన్నిక‌లకు ముందు యాక్టివ్‌గా ఉన్న నాయ‌కులు త‌ర్వాత మాత్రం ముఖం చాటేసిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌పై చంద్ర‌బాబు పోరాటం చేశారు.ఆ త‌ర్వాత ఎన్నిక‌ల సంఘంపై నే త‌న పోరాటం అంటూ సాగ‌దీశారు. ఇక‌, సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంతోనూ ఆయ‌న ఒంటికాలిపై లేచారు. ఆయా సంద‌ర్భాల్లో చంద్ర‌బాబు తీవ్ర‌స్తాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయా సంద‌ర్భాల్లో తండ్రిని వెనుకేసుకు వ‌చ్చిన మంత్రి నారా లోకేష్ ఎన్నిక‌ల త‌ర్వాత విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిపోయారు. అయినా లోకేష్ నోరు తెరిస్తే.. ఆయ‌న ఏం మాట్లాడ‌తాడో అని బాబు వ‌ణికిపోయిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.

నిజానికి చంద్ర‌బాబుకు చీమ‌కుడితే త‌మ‌కు తేలు కుట్టిన‌ట్టు బాధ‌ప‌డే నాయ‌కులు ఈ విష‌యంలో మాత్రం పెద్ద‌గా స్పందించ‌లేదు. బాబుకు అనుకూలంగా ఒక్క ప్ర‌క‌ట‌నా విడుద‌ల చేయ‌లేదు. ముఖ్యంగా నిత్యం మీడియాలో ఉండే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌కానీ, దేవినేని ఉమా కానీ.. ఇప్పుడు ఎక్క‌డా స్పందించ‌డం లేదు. అదేవిధంగా త‌న‌దైన శైలిలో మాట్లాడే ఆది కూడా ఇప్పుడు ఎక్క‌డామీడియాకు క‌నిపించ‌డం లేదు. ఇక‌, నోరు విప్పితే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర‌ప్ర‌సాద్ కూడా ఎక్క‌డిక‌క్క‌డ మౌనమే మేల‌న్న‌ట్టుగా ఉంటున్నారు. మ‌రి దీనికంతటికీ రీజ‌న్ ఏంటి? ఎలాగూ ఓడిపోతున్నాం.. ఇంకెందుకు మాట్లాడ‌డం అని వీరంతా అనుకుంటున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఈ మౌనానికి రీజ‌న్ ఏంట‌నేది ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాక కానీ తెలియదంటున్నారు సీనియ‌ర్లు.

తమ్ముళ్లు మద్దతు ఎక్కడ బాబు ?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share