చంద్ర‌బాబుకు చిక్కులే.. ఫ్యూచ‌ర్ మొత్తం క‌ష్ట‌మే

June 14, 2019 at 3:07 pm

అప్ర‌తిహ‌త రాజ‌కీయ చ‌తుర‌త‌తో రాష్ట్రాన్ని 20 ఏళ్ల‌పాటు ఏలాల‌ని నిర్దేశించుకున్న చంద్ర‌బాబు తొలి ఐదేళ్ల‌కే చ‌తికిల ప‌డిన సంద‌ర్భం మ‌నం చూస్తున్నాం. 102 మంది ఎమ్మెల్యేల‌ను సాధించిన 2014 ఎన్నిక‌ల త‌ర్వాత వ‌చ్చిన 2019 ఎన్నిక‌ల నాటికి ఆయ‌న సంఖ్య 23కు దిగ‌జారిపోవ‌డం పూర్తిగా స్వ‌యంకృతం. రాజ‌కీయంగా ఆయ‌న వేసిన అడుగులు, సంతృప్తి అంటూ ఆయ‌న చేసిన విన్యాసాలు ఏవీ కూడా ఫ‌లించ‌ని చందంగా మారిపోయాయి. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకుని ముందుకు సాగ‌డంలో చంద్ర‌బాబు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యార‌నేది వాస్త‌వం. త‌న‌ను విప‌క్షంలో ఉండ‌గా ఆదుకున్న వారిని అన్ని విధాలా ఆదుకునే క్ర‌తువుకే ఆయ‌న ప్రాధాన్యం ఇవ్వ‌డం పూర్తిగా ఆయ‌న‌ను అస్తిత్వంలోకి నెట్టాయి.

ఇక‌, ఇప్పుడున్న ప‌రిస్థితి ఏంటి? వ‌చ్చే ఐదేళ్ల‌లో పార్టీని ఆయ‌న ఎలా న‌డిపిస్తారు? అనే కీల‌క అంశాలు తెర‌మీదికి వ‌చ్చా యి. రాష్ట్రంలో యువకుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో పార్టీని యువ నాయ‌క‌త్వానికి అప్ప‌గించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఈ విష‌యంలో పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. పైగా.. ఇప్పుడు స‌భ‌లోనూ ఆయ‌న త‌న పార్టీ నేత‌ల‌ను కాపాడుకోలేని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్ప‌టికే త‌న‌కు ట‌చ్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నార‌ని జ‌గ‌న్ వెల్ల‌డించ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. అయితే, వారిని త‌న పార్టీలోకి చేర్చుకోన‌ని, అయినా వ‌స్తామంటే.. రాజీనామాల‌కు సిద్ధ‌ప‌డి రావాల‌ని జ‌గ‌న్ సూచించారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లోకోట్ల రూపాయలు ఖ‌ర్చు చేసిన ఈ నాయ‌క‌గ‌ణం.. రాజీనామాల‌కు సిద్ధ‌ప‌డే ప‌రిస్థితి లేదు. సో.. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న ఒకింత బాబుకు సాంత్వ‌న చేకూర్చేదే. అయితే, స‌భ‌లో మాత్రం అధికార పార్టీ దూకుడుకు క‌ళ్లెం వేయ‌లేని ప‌రిస్థితిని మాత్రం బాబు ఎదుర్కొన‌నుండ‌డం చాలా ఆలోచించాల్సిన విష‌యం. విప‌క్ష్ స‌భ్యులు ర‌గ‌డ చేస్తే.. అది చంద్ర‌బాబుకే అవ‌మాన‌మ‌నే ధోర‌ణిలో అధికార పార్టీ దూకుడు ప్ర‌ద‌ర్శించే ఛాన్స్ ఉంది. సీనియ‌ర్ అయి ఉండి కూడా స‌భ్యుల‌ను అదుపులో పెట్టుకోలేక పోతున్నార‌ని ఎదురు దాడి ప్రారంభించే అవ‌కాశం నిన్న‌నే మ‌నం గ‌మ‌నించాం.

అలాగ‌ని.. అధికార పార్టీపై దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. కూడా మొద‌టికే ముప్పు వాటిల్లే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. గ‌త ఐదేళ్ల‌లో మీరేం చేశారో చెప్పండ‌ని అధికార పార్టీ ఇరుకున పెట్టే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మొత్తంగా ఎలా చూసుకున్నా. ఇటు పార్టీని, అటు అసెంబ్లీలో స‌భ్యుల‌ను చాక‌చ‌క్యంగా న‌డిపించ‌క‌పోతే.. చంద్ర‌బాబు సీనియార్టీకి, ఆయ‌న నాయ‌క‌త్వానికి కూడా ముప్పు పొంచి ఉంద‌నేది నిజం.

చంద్ర‌బాబుకు చిక్కులే.. ఫ్యూచ‌ర్ మొత్తం క‌ష్ట‌మే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share