తెలంగాణ ఎంపీకి “పసుపు” పరీక్ష!

May 25, 2019 at 3:04 pm

తాజాగా ముగిసిన ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో విజ‌యం సాధించేందుకు ఎన్నిక‌ల ప్ర‌చారంలో నాయ‌కులు చేసిన వాగ్దానాలు గుర్తుండే ఉంటాయి. కొంద‌రు నోటి మాట‌గా ప్ర‌జ‌లు కోరిన డిమాండ్ల సాధ‌న‌కు సై అన్నారు. అదే మ‌రికొంద‌రు మాత్రం త‌మ నిజాయితీని మ‌రింత నిరూపించుకుంటామ‌ని ప్ర‌క‌టించి.. అతిశ‌యోక్తుల‌కు కూడా పోయారు ఇలాంటి వారే ప్ర‌జ‌ల‌కు తామిచ్చిన హామీల‌కు గాను బాండ్లు రాసిచ్చారు. తాము ఎట్టిప‌రిస్థితిలోనూ ఆ హామీని నిజం చేస్తామంటూ.. టౌం బౌండ్ కూడా పెట్టుకున్నారు. దీంతో ప్ర‌జ‌లు స‌ద‌రు నాయ‌కుల‌కు ప‌ట్టం క‌ట్టారు. ఇలా గెలిచిన వారు త‌మ వాగ్దానాల‌ను నిలుపుకొనేందుకు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు.

ఇలాంటి నాయ‌కుల్లో తెలంగాణ‌లోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం, సీఎం కేసీఆర్ త‌న‌య ఐదేళ్ల‌పాటు చ‌క్రం తిప్పిన నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి విజ‌యం సాధించిన ధ‌ర్మ‌పురి అర‌వింద్ కూడా ఇదే త‌ర‌హాలో ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు వాగ్దానం చేశారు. ఇక్క‌డి కీల‌క ప్ర‌ధాన స‌మ‌స్య ప‌సుపు రైతులు. ఇక్క‌డ ప‌సుపు పండించే రైతులు త‌మ‌కు గిట్టుబాటు ధ‌ర కూడా ద‌క్క‌డం లేద‌ని వాపోతున్నారు.ఈ క్ర‌మంలోనే వారి డిమాండ్ మేర‌కు ప‌సుపు కొనుగోలు చేసేందుకు ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనిపైనే అర‌వింద్ ఎన్న‌క‌ల్లో వాగ్దానం చేశారు. తాను ఎంపీ అయిన వెంట‌నే ప‌సుపు బోర్డు ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. అయితే, కేవ‌లం నోటి మాట‌గా కాకుండా ఏకంగా బాండ్ రాసిచ్చారు.

ఇదే ఇప్పుడు ఆయ‌న‌కు ప‌రీక్ష‌గా మారింది. కేంద్రంలోనూ బీజేపీనే అధికారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ స‌మ‌స్య నుంచి రైతుల‌ను గ‌ట్టును ప‌డేయ‌డం అర‌వింద్‌కు న‌ల్లేరుపై న‌డ‌కే అనుకున్నారు అంద‌రూ. అయితే, గ‌తంలో ఇక్క‌డ ఎంపీగా ఉన్న క‌విత కూడా ప‌సుపు బోర్డు ఏర్పాటుకు చేసిన కృషి వ్య‌ర్థ‌మైంది. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు ప‌సుపు బోర్డు ఏర్పాటుకు సుముఖంగా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌ళ్లీ ఇప్పుడు కూడా బీజేపీ ప్ర‌భుత్వం కేంద్రంలో కొలువు దీరడం , పీఎంగా న‌రేంద్ర మోడీ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఇక్క‌డ ప‌సుపు బోర్డు ఏర్పాటు కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితం అవుతుందా? లేక కేంద్రాన్ని ఒప్పించ‌గ‌ల‌రా ? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

తెలంగాణ ఎంపీకి “పసుపు” పరీక్ష!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share