డీకే అరుణ‌కు బీజేపీ భారీ ఆఫ‌ర్‌..!

March 20, 2019 at 9:50 am

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కోలుకోని దెబ్బ‌తిన్న కాంగ్రెస్ పార్టీకి.. ఇంకా దెబ్బ‌మీద దెబ్బ ప‌డుతూనే ఉంది. చేతిలో ఉన్న‌ కొద్దిపాటి ఎమ్మెల్యేలు కూడా వ‌రుస‌బెట్టి పార్టీని వీడుతుంటే రాష్ట్ర నాయ‌క‌త్వం చేతులేత్తేస్తోంది. క‌నీసం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లోనైనా.. ఒక‌టి రెండు సీట్లైనా గెలిచి ప‌రువు కాపాడుకోవాల‌ని చూస్తున్న ఆ పార్టీకి జేజ‌మ్మ రూపంలో మ‌రో షాక్ త‌గిలింది. రాజ‌కీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా.. గ‌జ్వేల్ జేజ‌మ్మ‌గా గుర్తింపు పొందిన డీకే అరుణ బీజేపీలోకి వెళ్లారు. ఈ ప‌రిణామాల‌తో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్ర‌తికూల ఫ‌లితాలు త‌ప్ప‌వ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

మంగ‌ళ‌వారం నుంచి సంప్ర‌దింపులు జ‌రిగాయి. ఈ మేరకు బీజేపీ నేత రాంమాధవ్‌ అరుణ నివాసానికి వెళ్లి ఆమెతో సంప్ర‌దింపులు జరిపినట్టు తెలిసింది. ఆ త‌ర్వాత‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా స్వ‌యంగా ఆమెతో ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. ఆ వెంట‌నే బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకు అరుణ ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. మంగ‌ళ‌వారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా పార్టీలో చేరే విష‌యమై చర్చలు కొనసాగాయి. ఆ త‌ర్వాత అక్క‌డే అమిత్‌షా స‌మక్షంలో ఆమె బీజేపీలో చేరారు. డీకే అరుణ‌కు బీజేపీ పెద్ద‌లు భారీ ఆఫరే ఇచ్చారు. ఆమెకు మహబూబ్‌నగర్‌ ఎంపీ సీటు ఇచ్చారు.

అయితే.. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య నెల‌కొన్న ఆధిప‌త్య పోరువ‌ల్లే డీకే అరుణ పార్టీ మారిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్ర‌నేత‌, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితో డీకే అరుణ‌కు బేధాభిప్రాయాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపంతోనే ప్ర‌తికూల ఫ‌లితాలు వ‌చ్చాయ‌నే టాక్ ఉంది. ఇందిలా ఉండ‌గా.. మంగ‌ళ‌వారం నాడు మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ సమక్షంలో బాపురావు బీజేపీలో చేరారు. ఆయ‌న ఆదిలాబాద్ లోక్‌స‌భ సీటు ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

డీకే అరుణ‌కు బీజేపీ భారీ ఆఫ‌ర్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share