మోడీ కేబినెట్ ప్రక్షాళ‌న ఏపీకి లాభ‌మా… న‌ష్ట‌మా..!

ఇప్పుడు అటు ఢిల్లీలోను, ఇటు అమ‌రావ‌తిలోనూ ఆ వ్యాఖ్య‌లే వినిపిస్తున్నాయి. కేంద్రంలో మోడీ త‌న కేబినెట్ విస్త‌ర‌ణను చేప‌డితే.. బాబుకు లాభం ఎలా? న‌ష్టం ఎలా ? అనే అంశాల‌పై చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇప్పుడు ఈ చ‌ర్చ‌కు ఎందుకు అవ‌కాశం వ‌చ్చింది? మ‌రే రాష్ట్రంలోనూ లేని ప్ర‌భావం కేంద్ర కేబినెట్ ఏపీపై ఎలా చూపుతుంది? అంటే.. బాబు మాట‌ల్లో చెప్పాలంటే.. ప్ర‌స్తుతం ఏపీ మూడేళ్ల ప‌సిపిల్ల‌. దీనికి కేంద్రం నుంచే ఆల‌న, లాల‌న అందాలి. అంటే, నిధులు గ‌ట్రా అన్న‌మాట‌. కాబ‌ట్టి కేంద్రంలో ఏర్ప‌డే ప్ర‌భుత్వం, మారే మంత్రులు ఏపీపై ప్ర‌భావం చూపుతార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

వాస్త‌వానికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేంద్రంలో బాబుకు ఎదురు లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్లిన వెంక‌య్య‌నాయుడే. ఆయ‌న కేంద్రంలో మంత్రిగా ఉన్న స‌మ‌యంలో రాష్ట్రానికి కావాల్సిన‌, రావాల్సిన నిధుల‌పై ఎంతో క‌స‌ర‌త్తు చేశారు. పీఎంఏవై ప‌థ‌కంలో భాగంగా భారీ సంఖ్య‌లో ఇళ్లు కూడా మంజూరు చేశారు. బాబు ఏం మాట్లాడాల‌నుకున్నా నేరుగా వెంక‌య్య పేషీకి ఫోన్ వెళ్లేది. అదేస‌మ‌యంలో కేంద్రంలో జ‌ల‌వ‌న‌రుల మంత్రిగాఉన్న ఉమా భార‌తి ఏకంగా బాబును త‌మ్ముడు అంటూ ఆప్యాయ‌త క‌న‌బ‌ర‌చ‌డంతోపాటు పోల‌వ‌రానికి ఎంతో మ‌ద్ద‌తిచ్చింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు ఒడిశా అడ్డు చెబుతుంటే.. దానిని లైన్‌లో పెట్టేందుకు ఉమా భార‌తి ఎంతో శ్ర‌మించారు.

అదేవిధంగా కేంద్రంలో రైల్వే మంత్రిగా నిన్న‌టి వ‌ర‌కు ఉన్న సురేష్ ప్ర‌భు, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయ‌ల్‌కూడా బాబుకు మంచి ఫేవ‌ర్ చేశారు. అస‌లు, పీయూష్ గోయ‌ల్ అయితే, దేశ‌వ్యాప్తంగా చంద్ర‌బాబును ఓ రేంజ్‌లో ఎత్తేశాడు. బాబు ఐక‌న్ అని విద్యుత్ పొదుపులో ఆయ‌న సాటి ఎవ‌రూ లేర‌ని, కూడా పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. అయితే, ఆదివారం వీరంతా త‌మ ప‌ద‌వుల‌కు రాం రాం చెప్పి కొత్త ప‌ద‌వులు ఎత్తుకున్నారు. బాబుకు అత్యంత కీల‌క‌మైన జ‌ల‌వ‌న‌రులను మ‌హారాష్ట్ర‌కు చెందిన గ‌డ్క‌రీకి, రైల్వేను పీయూష్‌కు అప్ప‌గించారు మోదీ.

దీంతో ఇప్పుడు బాబు వ్యూహాలు ఏమేర‌కు అమ‌ల‌వుతాయి? పోల‌వ‌రం అనుకున్న స‌మ‌యానికి పూర్త‌వుతుందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ, శాఖ‌లైతే మారినా.. వ్య‌క్తులు అంద‌రూ బాబుకు ఆప్తులేన‌ని అంటున్నారు టీడీపీ ఎంపీలు. ఇక ఎలాగూ ఢిల్లీలో చ‌క్రం తిప్పేందుకు సుజ‌నా ఉండ‌నే ఉన్నాడు కాబ‌ట్టి.. స‌మ‌స్య‌లేద‌ని చెబుతున్నారు. సో.. బాబుకు ఎలాంటి ఇబ్బందీ ఉండ‌ద‌ని అంటున్నారు. బాబు ఎవ‌రినైనా క‌లుపుకొని పోయే వ్య‌క్తి అని, ఆయ‌న‌కు క్లీన్ ఇమేజ్ ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.