ప‌వ‌న్ పార్టీ ఉంటుంది.. నాయ‌కులే ఊడ‌తారా…?

July 15, 2019 at 8:44 pm

సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని లిఖించుకుని ఏపీలో పావులు క‌దిపిన జ‌న‌సేన పార్టీ నేడు నిశ్తేజం అయిందా? న‌డిపించు నా నావా.. న‌డిసంద్ర‌మున దేవా! అంటూ.. నాయ‌కులు ప‌వ‌న్‌ను వేడుకుంటున్నారా? అయినా కూడా ఆయ‌న ఎక్క‌డా ప‌ట్టించు కోకుండా రెండు డైలాగులు.. నాలుగు యాక్ష‌న్ సీన్ల‌తోనే ప‌రిమిత‌మై.. స‌మీక్ష‌ల‌ను చ‌ట్టుబండ‌లు చేస్తున్నారా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజా ఎన్నిక‌ల్లో ఎదురైన ఘోర అవ‌మానం నుంచి ఇంకా పార్టీ కేడ‌ర్ బ‌య‌ట‌ప‌డ‌లేదు.

అధినేత దీనిని లైట్గా తీసుకున్నా.. కేడ‌ర్‌లో మాత్రం ఇంకా పవ‌న్‌పై న‌మ్మ‌కం కుద‌ర‌లేదు. దీంతో ఒకవైపు రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూనే వచ్చే స్థానిక సమరానికి అందరూ సిద్ధంగా ఉండాలంటూ పార్టీ కేడర్‌కు పిలుపు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో అలికిడి లేదు. అంతకంటేమించి నేత‌ల మ‌ధ్య‌ సమన్వయం లేదు. ప్రోత్సాహం అస్సలు లేనే లేదు. కుర్రకారు రేస్‌ గుర్రాల్లా పరుగులె త్తాల్సింది పోయి ఎక్కడికక్కడ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో పార్టీ ఉంటుంది.. కానీ, కేడ‌ర్ మాత్రం చెల్లాచెదుర‌వు తుంద‌ని అంటున్నారు. క్షేత్రస్థాయిలో కేడర్‌కు దిశా, నిర్దేశం చేసే నాయకత్వం కొరవడింది. అగ్ర నాయకులతో సహా దిగువస్థాయి నేతలెవ్వరూ చురుగ్గా లేకపోవడంతో సైన్యం చతికిలపడింది.

పార్టీలో ఇప్పటికే స్థానికంగా కమిటీలు ఏర్పడి ఉంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తేవి కాదనే అభిప్రాయం ఉంది. దీనికి తగ్గట్టుగానే చాలా నియోజకవర్గాల్లో పార్టీ తరపున అభ్యర్థుల గెలుపు కోసం కేడర్‌ యావత్తు నిద్రాహారాలు మాని పనిచేశారు. ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థులు ఆ తరువాత కేడర్‌కు టచ్‌ కోల్పోయారు. ఎన్నికల ముందు వరకు సొంత ఖర్చులతో పార్టీకి స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు వచ్చిన అభిమానులు సైతం తాజా పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో తమను పూర్తిగా వాడుకున్న వారంతా ఇప్పుడు గాలికి వదిలేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

నియోజకవర్గ స్థాయి ఇన్‌చార్జ్‌లుగా ప్రస్తుతం పోటీ చేసి ఓటమి పొందిన వారే బాధ్యత వహిస్తారంటూ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం కుదుపు లేదు. కేడర్‌ను ముందుకు నడిపించే సత్తా కూడా ఎవరికీ లేకుండా పోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రెడీగా ఉండండి అంటూ ప్రకటనలు వచ్చాయి. స్థానిక కమిటీలు లేకపోతే పార్టీకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో జనసేన ఇప్పుడు స్వయంగా భరిస్తుంది. ఎన్నికలకు ముందు గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలనుకున్నా.. దానిని వాయిదా వేసుకున్నారు. ఎన్నికలు రావడంతో అభ్యర్థుల ఎంపిక వైపు దృష్టి పెట్టి క్షేత్రస్థాయి పార్టీకి నాయకత్వం వహించే కేడర్‌ను వదిలేశారు. ఇప్పుడు అది కాస్తా పార్టీలో తలనొప్పి తెచ్చిపెడుతోంది.

ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే పార్టీపరంగా నిర్ణయాలు తీసుకునే వారు ఎవరని ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌లో అస‌లు ఏం జ‌రుగుతోంది? అనే ప్ర‌శ్న అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది. వ‌చ్చే రెండు మాసాల్లో అయినా పార్టీని బ‌లోపేతం చేయాలంటే.. నాయ‌కుడు ఇప్ప‌టి నుంచైనా స‌రైన ద‌శ దిశ‌తో ముందుకు న‌డవాల‌ని కోరుతున్న నాయ‌కుల సంఖ్య పెరుగుతోంది. మ‌రోప‌క్క, జ‌న‌సేన నేత‌ల‌పైనా బీజేపీ క‌న్నేసింది. దీంతో ఇప్పుడు ప‌వ‌న్ ముందు చాలా బాధ్య‌తే ఉంద‌ని అంటున్నారు.

ప‌వ‌న్ పార్టీ ఉంటుంది.. నాయ‌కులే ఊడ‌తారా…?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share