ఆ ఒక్క ఛాన్స్ వాడుకుంటే.. జ‌న‌సేన‌కు లైఫ్‌..!

June 25, 2019 at 1:09 pm

ఎన్నో ఆశ‌ల‌తో.. మ‌రెన్నో ఆశ‌యాల‌తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్‌. 2014లో పార్టీలోని స్థాపించినా.. ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండి.. అనుభ‌వం పేరుతో ఆయ‌న రాజ‌కీయాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తి చ్చారు. అయితే, తాజాగా ఎన్నిక‌ల విష‌యానికి వ‌చ్చేస‌రికి తానే స్వ‌యంగా రంగంలోకి దిగారు. భారీ ఎత్తున ప్ర‌చారం చేశారు. తానే స్వ‌యంగా రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. అయినా కూడా ఓడిపోయారు. కేవ‌లం ఒక్క ఎమ్మెల్యేను మాత్ర‌మే గెలిపించుకోగ‌లిగారు. క‌ట్ చేస్తే.. మ‌రో ఐదేళ్ల‌పాటు ఎన్నిక‌లు జ‌రిగే ఛాన్స్ లేదు.

ఈ నేప‌థ్యంలో పార్టీని బ‌లోపేతం చేయ‌డం ప‌వ‌న్ ముందున్న ప్ర‌ధాన ల‌క్ష్యం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా ప‌లు రాజకీయ క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. అయితే, క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన‌ను అభివృద్ధి చేయాలంటే.. ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాలంటే.. బ‌ల‌మైన ఆయుధం ఇప్పుడు జ‌న‌సేన‌కు చాలా అవ‌స‌రం. దానిని ప‌ట్టుకుని వెళ్తేనే ఇప్పుడు ప్ర‌జ‌ల్లో ఆయ‌న గుర్తింపు సాధించే అవ‌కాశం ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌త్యేక హోదా అంశాన్ని మ‌రోసారి తెర‌మీదికి బ‌లంగా తీసుకు రావాల‌ని ప‌వ‌న్ యోచిస్తున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న తాజాగా నిర్వ‌హించిన స‌మావేశంలోనూ చ‌ర్చించారు.

వాస్త‌వానికి హోదా విష‌యంలో గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. అనేక రూపాల్లో యూట‌ర్న్‌లు తీసుకుంది. ముందు హోదా కావాల‌ని, త‌ర్వాత వ‌ద్ద‌ని, మ‌ళ్లీ కావాల‌ని ఇలా అనేక యూట‌ర్న్‌లు తీసుకున్న నేప‌థ్యంలో ఇప్పుడు చంద్ర‌బాబు దీనిపై ఏం మాట్లాడినా.. ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి లేదు. ఇక‌, అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌.. కూడా హోదాపై కేవ‌లం మాట‌ల‌తోనే స‌రిపెడ‌తాన‌ని, పోరాటాల‌కు తాను వ్య‌తిరేక‌మ‌ని చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కేంద్రాన్ని అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ ప్ర‌శ్నిస్తున్నారు. కానీ, ఈ విష‌యంలో కేంద్రం మ‌రోసారి త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేసేసింది.

హోదా ఇచ్చే ప్ర‌తిపాద‌న లేద‌ని, హోదా అనేది ముగిసిన అధ్యాయ‌మ‌ని వెల్ల‌డించింది. అయితే, ఇప్పుడు ప‌వ‌న్ ఇదే విష‌యాన్ని ప‌ట్టుకుని రాజ‌కీయాల్లో వేడి ర‌గిలిస్తే.. ప్ర‌జ‌ల్లో ఆయ‌న త‌న ఫేంను పెంచుకోవ‌డం తోపాటు. పార్టీ తర‌ఫున కూడా పెద్ద ఎత్తున ల‌బ్ధి పొందే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో హోదాపై ఒక స్టాండ్ తీసుకుని, అటు కేంద్రం లోని బీజేపీ,ఇటు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్ట‌డ‌మో.. ప్ర‌శ్నించ‌డమో.. ప్ర‌జ‌ల‌ను స‌మీక‌రించి ఆందోళ‌న బాట ప‌ట్టడ‌మో చేస్తే.. ఇటు రాష్ట్రానికి, అటు ప‌వ‌న్‌కు కూడా ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదే టైంలో జ‌న‌సేన‌కు కూడా రాజ‌కీయంగా మంచి లైఫ్ ఉండ‌నుంది.

ఆ ఒక్క ఛాన్స్ వాడుకుంటే.. జ‌న‌సేన‌కు లైఫ్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share