ఓటేయ‌క‌పోతే అంతు చూస్తా.. : జేసీ దివాక‌ర్‌రెడ్డి

April 1, 2019 at 11:24 am

త‌న‌దైన శైలిలో, ఎప్పుడూ వివాదాల‌తో చెలిమి చేసే జేసీ దివాక‌ర్‌రెడ్డి ఇప్పుడు మ‌రో మారు వార్త‌లో నిలిచారు. త‌న‌ను తాను ఎంతో గొప్ప‌గా చూపించుకునేందుకు స‌భ్య‌తా సంస్కారం మ‌ర‌చిపోయి దిగ‌జారుడు రాజ‌కీయాలు న‌డుపుతున్నారు. నిన్న‌టికి నిన్న ఓ ప్ర‌చార స‌భ‌లో తొడ‌గొట్టి స‌వాల్ విసిరిన జేసీ గారు ఇప్పుడు ఏకంగా ప్ర‌జ‌ల‌తో ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. పుట్లూరు మండ‌ల కేంద్రంలో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ఘాటుగా మాట్లాడారు. పుట్లూరు ఓట‌ర్లెప్పుడు త‌న‌కు ఓటు వేయ‌లేద‌ని, ఈ సారి ఓటు వేయ‌కుంటే వారి అంతు చూస్తాన‌ని హెచ్చ‌రించారు. మండ‌లంలోని తాగునీటి స‌మ‌స్య‌పై ప్ర‌శ్నించిన వెంక‌ట‌నారాయ‌ణ అనే వ్య‌క్తిపై జేసీని ఆగ్రహంతో ఊగిపోయారు. న‌న్ను ప్ర‌శ్నించే వాళ్ల‌య్యారా అంటూ చిందులేశారు. ఒక్కొక్క‌డిని తొక్కేస్తా అంటూ నానా బూతులు అందుకున్నాడు. నోటికి వ‌చ్చిన మాట‌ల‌ను వెన‌క్కి తీసుకోకుండా ఆవేశంలో ఊగిపోయారు.

కాగా, జేసీ దివాక‌ర్‌రెడ్డికి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని, ఆ భ‌యంతోనే ఏమేమి మాట్లాడుతున్నాడో ఆయ‌న‌కే అర్థం కాకుండా పోయింద‌ని పుట్లూరు వైసీపీ నేత రాఘ‌వ‌రావు అన్నారు. ప్ర‌జ‌ల్లో నిలిచి గెలిచే ధైర్యం లేక జేసీ దివాక‌ర్‌రెడ్డి అవాక్కులు చెవాక్కులు పేలుతున్నార‌న్నారు. వైఎస్ జ‌గ‌న్‌కు వ‌స్తున్న ప్ర‌జాద‌ర‌ణ‌ను చూసి జీర్ణించుకోలేక, ప్ర‌జ‌ల‌ను బెదిరింపుల‌కు పాల్ప‌డుతూ త‌న‌దైన అల్ప‌బుద్ధిని చూపించుకుంటున్నార‌ని రాఘ‌వ‌రావు దుయ్య‌బ‌ట్టారు.

ప్రభుత్వం చేసిన ప‌నుల‌ను చూపించుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల్సిన అధికార పార్టీ నేత‌లు ఇలా భ‌య‌భ్రాంతుల‌కు గురిచేయ‌డం స‌రికాద‌న్నారు. బెదిరింపులు, హ‌డ‌లెత్తించ‌డాలు చేస్తే ఓట్లు రాల‌వ‌ని ఈ విష‌యాన్ని అధికార పార్టీ నాయ‌కులు గ్ర‌హించాల‌ని కోరారు. కాగా, అనంత‌పురం జిల్లా పుట్లూరులో జేసీ ఇష్టారీతిగా వ్య‌వ‌హరిస్తున్నా పోలీసులు మాత్రం మిన్న‌కుండిపోయారు. త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్టు చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌జ‌లు జేసీ వ్యాఖ్య‌ల‌తో భ‌యాందోళ‌న‌కు గురైనా క‌నీసం వ‌ద్ద‌ని వారించే పనికి కూడా పోలీసులు పూనుకోలేదు. రాయ‌లేని బండ‌బూతులు తిడుతున్నా జేసీని వ‌ద్ద‌ని చెప్పే వారేలేకుండాపోయారు. అధికార పార్టీ దౌర్జన్యాల‌ను క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తూ ఉండిపోయారే గానీ అడ్డుచెప్ప‌డానికి సాహ‌సించ‌లేదు.

ఓటేయ‌క‌పోతే అంతు చూస్తా.. : జేసీ దివాక‌ర్‌రెడ్డి
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share