ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌పై కేసీఆర్ సైలెంట్‌..!

June 12, 2018 at 8:44 am

జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి, దేశ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క  మార్పు తెస్తాన‌ని చెప్పిన టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొద్దిరోజులుగా మౌనం వ‌హిస్తున్నారు. ఈ సైలెంట్ వెనుక ఆంత‌ర్య‌మేమిట‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కులకు కూడా అంతుబ‌ట్ట‌డం లేదు. కానీ.. అనేక‌ ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు నుంచి కేసీఆర్ ప‌క్క‌కు జ‌రిగారా..?  లేక ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టేశారా..? అన్న‌దానిపై ఆసక్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. మొద‌ట్లో హ‌డావుడిగా ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లి ప‌లువురు ప్రాంతీయ పార్టీల నేత‌ల్నిక‌లిసిన కేసీఆర్ ఇప్పుడెందుకు ఆ మాట ఎత్త‌డం లేదు..? ఒడిశా ప‌ర్య‌ట‌న‌ను ఎందుకు ర‌ద్దు చేసుకున్నారు..? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. 

 

అయితే ఫ్రంట్ ఏర్పాటుపై అంచ‌నాలు త‌ల‌కిందులు కావ‌డం, ఇదే స‌మయంలో తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుని ప‌రిణామాలు వేగంగా మార‌డ‌మే కేసీఆర్ సైలెంట్‌కు కార‌ణ‌మ‌నే వాద‌న కూడా బ‌లంగా వినిపిస్తోంది. 

నిజానికి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో ఢిల్లీ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌డం.. ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌లో త‌న‌యుడు కేటీఆర్‌కు ప‌గ్గాలు అప్ప‌జెప్పాల‌న్న‌ది కేసీఆర్ వ్యూహం. ఈ క్ర‌మంలో ఆయ‌న వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పిన కేసీఆర్ కేవ‌లం ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్షాల‌ను ట‌చ్ చేయ‌కుండా కేవ‌లం యూపీఏ భాగ‌స్వామ్య ప‌క్షాల నేత‌ల‌తోనే ఆయ‌న భేటీ కావ‌డంపై అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. 

 

ఈ క్ర‌మంలోనే తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలిపై కొంత అప్ర‌మ‌త్తంగానే ఉన్న‌ట్లు తెలిసింది. అదే స‌మ‌యంలో త‌మిళ‌నాడుకు చెందిన డీఎంకే నేత‌లు క‌రుణానిధి, స్టాలిన్‌లు కూడా కేసీఆర్‌కు పూర్తి స్థాయిలో హామీ ఇవ్వ‌లేదు. వీరి భేటి మ‌రునాడే.. డీఎంకే ఎంపీ, క‌రుణానిధి కూతురు క‌నిమొళి ఫ్రంట్‌పై తామేమీ మాట్లాడ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీతో జేడీఎస్ క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం.. జేడీఎస్ నేత కుమార‌స్వామి ముఖ్య‌మంత్రి కావ‌డంతో కేసీఆర్ కంగుతిన్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుపై బెంగ‌ళూరుకు వెళ్లి జేడీఎస్ నేత దేవెగౌడ, కుమార‌స్వామిల‌ను కేసీఆర్ క‌లిసిన విష‌యం తెలిసిందే. కానీ.. అక్క‌డ కేసీఆర్ అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. 

 

తాజాగా.. కాంగ్రెస్ పార్టీ లేని కూట‌మి అసాధ్య‌మంటూ జేడీఎస్ కీల‌క నేత ఒక‌రు వ్యాఖ్యానించి కేసీఆర్‌కు షాక్ ఇచ్చారు. ఇక ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టికే ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌, ఆర్ఎల్‌డీలు క‌లిసి ఉప ఎన్నిక‌ల్లో బీజేపీని మ‌ట్టి క‌రిపించాయి. ఈ నేప‌థ్యంలో అఖిలేశ్, మాయ‌వ‌తి కేసీఆర్‌తో క‌లిసి న‌డ‌వడం క‌ష్ట‌మేన‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కూడా క‌లిసి న‌డ‌వాల‌ని ఇప్ప‌టికే సూచ‌నాప్రాయంగా ఆ పార్టీలు నిర్ణ‌యించాయి.

 

తెలంగాణ‌లోనూ రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. రోజురోజుకూ కాంగ్రెస్‌పార్టీ పుంజుకుంటోంది. మ‌రోవైపు జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం తెలంగాణ జ‌న స‌మితి పేరిట కొత్త‌పార్టీ ఏర్పాటు చేశారు. ఆయ‌న కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఎక్కువ‌గా యువ‌త‌ను ప్ర‌భావితం చేస్తున్నారు. ఇంకోవైపు.. తెలంగాణ‌లో పాగా వేయాల‌ని బీజేపీ క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు అంత‌సులువు కాద‌నే వాద‌న టీఆర్ఎస్ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. 

 

ఈ క్ర‌మంలోనే తెలంగాణ రాజ‌కీయాల‌పైనే కేసీఆర్ దృష్టిసారించాల‌నే డిమాండ్ పార్టీవ‌ర్గాల్లో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. దీంతోనే క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారానికి వెళ్ల‌లేద‌నే టాక్ వినిపించింది. అంతేగాకుండా…కాంగ్రెస్ పార్టీతో వేదిక పంచుకోవ‌డం ఇష్టంలేక‌నే ఆయ‌న వెళ్ల‌లేద‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. క‌లిసొస్తార‌న్న‌కున్న‌వాళ్లంద‌రూ కాంగ్రెస్‌కు ద‌గ్గ‌ర‌కావ‌డం.. తెలంగాణ‌లో ప‌రిస్థితులు మారుతుండ‌డంతో కేసీఆర్ అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌పై కేసీఆర్ సైలెంట్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share