కృష్ణాపై ఆ మూడు పార్టీల అంచ‌నాలు ఇవే..!

May 3, 2019 at 3:52 pm

ఎన్నిక‌లు ముగిసిన ఏపీలో రాజ‌కీయం వేడి మాత్రం ఎన్నిక‌ల‌కు ముందు ఎలా ఉందో ఇప్ప‌టికీ అలానే ఉంది. తీవ్ర ఉ త్కంఠ భ‌రిత వాతావ‌ర‌ణంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా రెండు పార్టీలు వైసీపీ-టీడీపీ పోటీ ప‌డ్డాయి. అయితే, వీటికి మ‌రో పార్టీ జ‌న‌సేన కూడా తోడైంది. ప‌లుజిల్లాల్లో ఈ రెండు పార్టీల‌తో స‌మానంగానే పోటీ ఇచ్చింది. అభ్య‌ర్థుల ఎంపిక‌, పోటీ, ప్ర‌చారం వంటి వాటి విష‌యంలో జ‌న‌సేన దుమ్మురేపింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా కృష్ణా, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన భారీ ఎత్తున పోటీ చేసి, గ‌ట్టి పోటీ ఇచ్చింద‌నే చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఈ మూడు పార్టీల అంచ‌నాలు ఎలా ఉన్నాయ‌నే విష‌యంపై చ‌ర్చ న‌డుస్తోది. రాజ‌ధాని ప్రాంత జిల్లాగా ఉన్న కృష్ణాజిల్లాలో ప‌రిస్థితిని చూస్తే.. నాయ‌కులు ఎవ‌రికి వారే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. గ‌త 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి 10 స్థానాల్లో టీడీపీ విజ‌యం సాధించింది. 5 స్థానాల్లో వైసీపీ, ఒక‌చోట బీజేపీ గెలుపొందాయి. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో ఇద్ద‌రు వైసీపీ నాయ‌కులు టీడీపీలోకి జంప్ చేశారు. ఇక‌, ఇప్పుడు ఇక్క‌డ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ రెండు పార్టీలు కూడా మెజారిటీ స్థానాల‌ను త‌మ ఖాతాలో వేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేశాయి. ఈ క్ర‌మంలో అభ్య‌ర్థుల ఎంపిక‌ను కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఇక‌, మూడో పార్టీ జ‌న‌సేన కూడా త‌మ అభ్య‌ర్థుల‌ను గ‌ట్టివారినే ఇక్క‌డ పోటీకి పెట్ట‌డం గ‌మ‌నార్హం. కృష్ణాలోని నాలుగు నుంచి ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో కాపుల ఓటు బ్యాంకు ఉండ‌డంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన గ‌ట్టి పోటీ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, టీడీపీ నేత‌ల అంచ‌నాల ప్ర‌కారం ఇక్క‌డ నుంచి ఈ ద‌ఫా 12 నుంచి 14 స్థానాల్లో విజ‌యం సాధిస్తామ‌ని అంటున్నారు. విజ‌య‌వాడ‌లోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని చెబుతున్నారు. తూర్పు, ప‌శ్చిమ‌, సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల‌పై టీడీపీ ఎక్కువ‌గానే ఆశ‌లు పెట్టుకుంది. అదేవిధంగా అవ‌నిగ‌డ్డ‌, పెన‌మ‌లూరు, మ‌చిలీ ప‌ట్నం, కైక‌లూరు, గుడివాడ‌ల్లో గెలుపు ఖాయ‌మ‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్నారు. ప్ర‌ధానంగా గుడివాడ‌లో వైసీపీ అభ్య‌ర్థి కొడాలి నానిని ఓడించ‌డమే ధ్యేయంగా ఇక్క‌డ దేవినేని అవినాష్‌ను నిల‌బెట్ట‌డం పార్టీలో అంచ‌నాల‌ను పెంచింది. ఇక‌, అవ‌నిగ‌డ్డ‌లో సంప్ర‌దాయ ఓటింగ్ మొత్తం త‌మ అభ్య‌ర్థి మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్‌కే చెందుతుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు.

అదేవిధంగా వైసీపీ కూడా ఇక్క‌డ భారీ అంచ‌నాలే వేసుకుంది. పామ‌ర్రు, నూజివీడు, జ‌గ్గ‌య్య‌పేట‌, తిరువూరు వంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు స‌హా విజ‌య‌వాడలో సెంట్ర‌ల్‌, ప‌శ్చిమ‌, పెన‌మ‌లూరు, గ‌న్న‌వ‌రం వంటి చోట్ల గెలుపు త‌థ్య‌మ‌ని భావిస్తున్నారు. ఇక‌, మూడో పార్టీ జ‌న‌సేన నాయ‌కులు కూడా కృష్ణాలో త‌మ‌కు మూడు స్థానాల్లో గెలుపు త‌థ్య‌మ‌ని భావిస్తున్నారు. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన అభ్య‌ర్థి బ‌త్తిన రాము గెలుపుపై పందేలు క‌ట్ట‌డం వీరి అంచ‌నాల‌ను తెలియ జేస్తోంది. కాపు సామాజిక వ‌ర్గం ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని ఈ నాయ‌కులు భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుంద‌నేది ఈ నెల 23 న కానీ స్ప‌ష్టం కాదు.

కృష్ణాపై ఆ మూడు పార్టీల అంచ‌నాలు ఇవే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share