లగడపాటి సర్వేపై బెట్టింగ్ రాయుళ్లు బహుపరాక్

May 19, 2019 at 11:32 am

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రో మూడు రోజుల్లో వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో మ‌రోసారి చిల‌క జ్యోతిష్యుడు బ‌య‌లుదేరాడు. ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మరోసారి టిడిపి సానుభూతిపరులను నిండా ముంచేందుకు రెడీ అవుతున్నాడు. రాజగోపాల్ తాజాగా ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో ఎవరు ? గెలుస్తారో అంటూ చేసిన వ్యాఖ్యల్లో తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్నందున వాళ్ళు కారును కోరుకున్నారని… ఏపీలో లోటు బడ్జెట్ ఉన్నందున వీరు సైకిల్ ఎక్కార‌ని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాజగోపాల్ వ్యాఖ్యలను బట్టి చూస్తే తెలంగాణ లోక్‌స‌భ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ సీట్లు దక్కించుకుందని తెలుస్తోంది. ఈ విషయం రాజగోపాల్ చెప్పడం మాత్రమే కాదు అన్ని జాతీయ మీడియా సర్వేలు, స్థానిక రాజకీయ వర్గాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఇక ఏపీ సాధారణ ఎన్నికల విషయానికి వస్తే ఇక్కడ విపక్ష వైసీపీ అధికారంలోకి రాబోతుందని జాతీయ మీడియాతో పాటు చాలా సర్వేలు ఇప్పటికే చెప్పేశాయి. మరో మూడు రోజుల్లో ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఆదివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల అవుతున్నాయి. మరి ఈ టైంలో రాజగోపాల్ తెలుగుదేశం పార్టీకి లబ్ధి కలిగేలా ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ? అన్న ప్రశ్నకు ఈ రోజు ఏపీలో ఏడు కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్‌లో టిడిపికి లబ్ధి చేకూర్చేందుకేనా ? అన్న సందేహాలు ఉన్నాయి. సరే ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం ఏపీలో ఏ పార్టీ ? గెలుస్తుంది.. ఎవరికి ? ఎన్ని సీట్లు వస్తాయని చెబుతాను అన్న‌ రాజగోపాల్ మరోసారి పచ్చని చిలుక‌లా మాట్లాడటం దాదాపు ఖాయమైంది. రాజగోపాల్ ఇప్పటివరకు తాను చెప్పిన స‌ర్వేల‌న్నీ నూటికి నూరు శాతం నిజ‌మ‌య్యాయ‌ని ఒక తెలంగాణ విష‌యంలోనే త‌న లెక్క త‌ప్పింద‌ని చెబుతున్నాడు.

వాస్త‌వంగా రాజ‌గోపాల్ గ‌తంలో చెప్పిన స‌ర్వేల్లో చాలా వ‌ర‌కు రివ‌ర్స్ అయ్యాయి. గతంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజగోపాల్ సర్వే జయలలిత ఓడిపోతుందని చెప్పగా పూర్తిగా రివర్స్ అయి జయలలిత మరోసారి అధికారంలోకి వచ్చింది. గత ఏడాది కర్ణాటక ఎన్నికల్లో చాలా సర్వేల్లో హంగ్‌ వ‌స్తుందని చెపితే… రాజ‌గోపాల్ బీజేపీకి తిరుగులేని మెజారిటీ వ‌స్తుంద‌ని చెప్పాడు. చివ‌ర‌కు జేడీఎస్ కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో సీఎం పీఠం ద‌క్కించుకుంది. ఇక గ‌త ఏడాది చివ‌రిలో జ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల్లో రాజ‌గోపాల్ ఫ‌లితాలు పూర్తిగా రివ‌ర్స్ అయ్యాయి. తెలంగాణ ఎన్నికల్లో రాజగోపాల్‌ను నమ్మి కోట్లాది రూపాయలు బెట్టింగ్ కట్టినవారు నిండా మునిగి పోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ, నంద్యాల ఎన్నికల్లో బెట్టింగులు కాసి భారీగా డబ్బులు కూడా పెట్టిన‌ ఆంధ్రాలోని కమ్మ సామాజిక వర్గం తెలంగాణ ఎన్నికల్లో రాజగోపాల్ ను నమ్ముకుని మొత్తం గుల్ల అయిపోయింది.

కొందరు ఆస్తులు తాకట్టు పెట్టి రోడ్డున పడ్డారు. మరికొందరు స్థిరాస్తులు కోల్పోయారు. ఇక ఇప్పుడికి ఆరుగాలం కష్టపడి పంటలు పండించుకుని ఇప్పుడే చేతికి డబ్బులు అందుకుంటోంది. లగడపాటి తెలంగాణ ఎన్నికల్లో వారిని పూర్తిగా గొల్ల చేసి వాళ్లంతా కోట్లాది రూపాయలు పోగొట్టుకునేందుకు కారణమయ్యారు. ఇప్పుడు ఈ సామాజిక వర్గం వారు మరోసారి లగడపాటి పచ్చ జ్యోతిష్యాన్ని నమ్మితే నిండా మున‌గ‌టం ఖాయం. ఇప్పటికే ఓ వైపు సర్వేలతో పాటు, టిడిపి మంత్రులు కూడా ఈ సారి తమ పార్టీ అధికారంలోకి రావడం కష్టమని చెపుతుంటే లగడపాటి ఏ ఉద్దేశంతో ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయ‌ని హడావుడి చేస్తుండ‌డం చాలా సందేహాలకు కారణంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో లగడపాటి చెప్పినట్టు ఫలితాలు వచ్చినా రాకపోయినా ఆయనకేం కాదు కానీ లగడపాటిని నమ్ముకుని కోట్లాది రూపాయలు పందాలు కాసే వారు మాత్రం సర్వం కోల్పోయి రోడ్డుమీద పడాల్సిందే.

ఒకవేళ రేప‌టి ఫ‌లితాల్లో ఎవ‌రు అయినా గెల‌వ‌వ‌చ్చు… కానీ రాజ్‌గోపాల్ స‌ర్వే నూటికి నూరుశాతం నిజ‌మ‌నీ న‌మ్మ‌లేం. ఆయ‌న బెట్టింగుల‌ను ప్రోత్స‌హించేందుకు… బెట్టింగ్ రాయుళ్ల‌కు ల‌బ్ధి చేకూర్చేందుకు కూడా ఇలా వ్య‌వ‌హ‌రిస్తోన్న‌ట్టు సందేహాలున్నాయ్‌. ముఖ్యంగా గుంటూరు, కృష్ణాతో పాటు ప్రకాశం ఉభ‌య‌గోదావరి జిల్లాలో ఆర్థికంగా బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం పెద్దలు రాజగోపాల్ నమ్మి భారీగా పందేలు కాసేందుకు సిద్ధ‌మై ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో చాలావరకు ఆస్తులను పోగొట్టుకున్న వీరంతా ఇప్పుడు మరోసారి రాజగోపాల్‌ను నమ్మితే మ‌రోసారి ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఆంధ్రా కమ్మ వారంతా రాజగోపాల్ చిలక జ్యోతిష్యాన్ని నమ్మకుండా బెట్టింగ్ అనే వ్యసనానికి దూరంగా ఉంటే ఈ సారి అయినా వారి ఆస్తుల‌ను కాపాడుకున్న‌ట్లు అవుతుంది. ఇక క‌మ్మ సామాజిక‌వ‌ర్గమే కాదు రాజ‌గోపాల్‌ను న‌మ్ముకుని బెట్టింగ్ వేస్తే ఎవ‌రైనా తెలంగాణ‌ ఎన్నిక‌ల ఫ‌లితాల మీద బెట్టింగ్ వేసి ఎదుర్కొన్న చేదు అనుభ‌వ‌మే ఎదుర్కొవాల్సి ఉంటుంది.

లగడపాటి సర్వేపై బెట్టింగ్ రాయుళ్లు బహుపరాక్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share