వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ల‌గ‌డ‌పాటి… నియోజ‌క‌వ‌ర్గం క‌న్‌ఫార్మ్‌..!

ఆంధ్రా ఆక్టోప‌స్‌గా పేరొందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పేరు తెలియ‌ని వారుండ‌రు! రాష్ట్ర విభ‌జ‌న‌లో కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రించిన తీరుకు తీవ్రంగా క‌లత చెందిన ఆయ‌న‌.. కొద్ది కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. కానీ ప్ర‌స్తుతం ఆయన రాజ‌కీయాల్లో యాక్టివ్ కావాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. దీనికి సంబంధించి మ‌రో సంచ‌ల‌న విష‌య‌మేంటంటే.. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష వైసీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యే పోటీ చేయ‌బోతున్నార‌ట‌. ఇందుకు సంబంధించి నియోజ‌క‌వ‌ర్గం కూడా దాదాపు ఖ‌రారు అయింద‌ని స‌మాచారం. ఈ మేర‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్‌, ల‌గ‌డ‌పాటి మ‌ధ్య సీక్రెట్ మీటింగ్ కూడా జ‌రిగింద‌ని తెలుస్తోంది.

ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర పడుతున్న కొద్దీ వైసీపీలో చేరుతున్న నాయ‌కుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీలోని కీల‌క నేత‌లు వైసీపీ కండువా క‌ప్పుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం జరగబోతోందని తెలుస్తోంది. వివిధ వర్గాల ప్రచారం ప్రకారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో రాజకీయ సన్యాసం తీసుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. బెంగళూరులో జరిగిన ఈ భేటీలో ఏకాంతంగా 45 నిమిషాల పాటు జగన్ తో లగడపాటి మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఇటీవల ఏపీ రాజకీయాల గురించి ల‌గ‌డ‌పాటి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ బలంగా ఉందని విశ్లేషించారు. కొద్దికాలంగా ఆ పార్టీ బలోపేతం అయిందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో అధికార టీడీపీ వైసీపీలకు సమానంగా మద్దతు ఉందని విశ్లేషించారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే రాబోయే ఎన్నికల్లో ఏపీలో అధికారం కోసం గట్టి పోటీ ఉండేలా కనిపిస్తోందని వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే! కాగా ప్ర‌స్తుతం జ‌గ‌న్‌, ల‌గ‌డ‌పాటి భేటీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ భేటీలో వైసీపీలో చేరడం, పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంపై కూడా జ‌గ‌న్‌తో ల‌గ‌డ‌పాటి చ‌ర్చించార‌ట‌. మైలవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని ప్ర‌చారం జ‌రుగుతోంది. 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పొట్లూరి ఖరారు అయిన విషయము తెలిసిందే .ఇప్పుడు ఆ స్థానం ఖాళీగా లేకపోవటంతో లగడపాటి మైలవరం సీటు పై ఆసక్తి చూపగా అందుకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మంచి ముహూర్తం చూసుకొని విజయవాడలో భారీ బహిరంగ నిర్వహించి జగన్ సమక్షంలో పార్టీ లో చేరేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు స‌మాచారం.