కూట‌మి చిత్తు చిత్తు.. రీజ‌న్ ఇదే… !!

December 11, 2018 at 12:30 pm

రాజ‌కీయాల్లో అనుకున్న‌వి అనుకున్న‌ట్టు జ‌రిగితే.., నాయ‌కుల‌కు ప‌ట్ట‌ప‌గ్గాలు ఉండ‌వు అంటారు అనుభ‌వజ్ఞులు. అందుకే ఆచితూచి అడుగులు వేయాల‌నేది రాజ‌కీయాల్లో ప్ర‌ధాన సూత్రం కూడా! ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే తెలంగాణా ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇక్క‌డ మ‌హాకూట‌మిగా ఏర్ప‌డి.. టీఆర్ ఎస్‌ను ఢీకొట్టాల‌ని నిర్ణ‌యించుకుంది కాంగ్రెస్ పార్టీ. నిజానికి ఆ వ్యూహాన్ని త‌నంత‌ట తానుగా.. పూర్తినిబ‌ద్ధ‌త‌తో అమ‌లు చేసుకుని ఉంటే.. ప‌లు ప్ర‌చారాల్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ చెప్పిన‌ట్టు“మ‌హా కూట‌మి లేదు .. ఓట‌మి!“ సాకారం అయి ఉండేదేమో! కానీ, అలా వెళ్ల‌కుండా.. నిముషానికో నిర్ణ‌యం తీసుకున్న ఫ‌లితంగా మ‌హాకూట‌మి.. ఓట‌మి.. ఓట‌మి ! అనే రేంజ్‌కి దిగ‌జారింది.

ప్ర‌జల నాడిని ప‌ట్టుకోవ‌డంలో మ‌హాకూట‌మి పూర్తిగా విఫ‌ల‌మైంది. ప్ర‌ధానంగా ఏపీలో ప్ర‌భుత్వాన్ని న‌డుపుకొంటున్న చం ద్రబాబును తీసుకొచ్చి.. కేసీఆర్ చెప్పిన‌ట్టు భుజాల మీద‌కు ఎక్కించుకోవ‌డం ద్వారా తెలంగాణా స‌మాజం యొక్క విశ్వస నీయ‌త‌ను కాంగ్రెస్ పోగొట్టుకుంది. దీనిపై అనేక వార్త‌లు వ‌చ్చాయి. అయినా కూడా కాంగ్రెస్ ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఫ‌లితంగా నేడు మ‌హా ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. నిజానికి తెలంగాణాలో చంద్ర‌బాబు ప్ర‌వేశంతోనే కంగ్రెస్ ఓటమి ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ చివరకు సరైన ఎత్తుగడ లేక ఎన్నికల్లో చతికిలపడింది. ముందస్తు ఎన్నికలు అనివార్యమని తేలిపోయిన తర్వాత ఎంతో సమయం ఉన్నప్పటికీ తగిన వ్యూహ రచన చేయడంలో ఆ పార్టీ విఫలమైంది.

ప్రధానంగా టీడీపీతో పొత్తు తీవ్ర స్థాయిలో బెడిసి కొట్టింది. ముఖ్యంగా చంద్రబాబుతో కాంగ్రెస్ నేతల లాలూచీ వ్యవహారాలు టీఆర్ఎస్ మరింత బలం చేకూర్చినట్లయిందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్‌కు మొదటి నుంచి బలమైన స్థానాల్లో సైతం ఈసారి ఫలితాలు తారుమారు కావడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటంలేదు. తెలంగాణలో బలమైన స్థానాల్లో సైతం పార్టీ ప్రతికూల ఫలితాలు రావడమంటే పొత్తు ఎత్తుగడ పూర్తిగా బెడిసికొట్టినట్టు అర్థమవు తోంది. కాంగ్రెస్ ముఖ్య నాయకులు సైతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్దకు క్యూ కట్టడం, ఆయన ఆదేశాలకు అనుగుణంగా నాయకులు నడుచుకోవడం, చంద్రబాబుతో ప్రచారం చేయించుకోవడం వంటి అనేక పరిణామాలు ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించాయని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏదేమైనా.. వ్యూహ లోపం స్ప‌ష్టంగా క‌నిపించింది.

కూట‌మి చిత్తు చిత్తు.. రీజ‌న్ ఇదే… !!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share