
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఇప్పుడు పార్టీ మారుతున్నారు. తొలినుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నప్పటికీ.. ఆ పార్టీనుంచి బహిష్కరణకు గురై… తర్వాత ఏ పార్టీలోనూ చేరకుండా.. ప్రస్తుతానికి స్వతంత్రుడిగానే ఉన్న మోత్కుపల్లి నరసింహులు.. ఎట్టకేలకు తెలంగాణలో బలం పుంజుకోవడానికి రకరకాలుగా కష్టపడుతున్న భారతీయ జనతా పార్టీలో చేరడానికి నిశ్చయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ వెలివేసిన తర్వాత.. మోత్కుపల్లి నరసింహులు చాలా కాలం పాటూ చంద్రబాబును విమర్శించడంతో కాలం గడిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఇండిపెండెంటుగా పోటీచేశారు. ఫలితం దక్కలేదు. ఆయన సీనియారిటీని ప్రజలు పట్టించుకోలేదు. మళ్లీ మౌనంగా అయిపోయారు. ఆ సమయంలో.. ‘ఇవే చివరి ఎన్నికలు.. ఇక రిటైరవుతా.. మద్దతివ్వండి’ అంటూ ప్రచారం చేసుకున్న ప్రజలు పట్టించుకోలేదు. ఇక రిటైరైనట్లే అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా కమలదళం వైపు వెళుతున్నారు.
పార్టీ మారడం అనేది ఆయనకు ఈజీగానే సాధ్యమవుతుందేమో గానీ.. ఆయన చిరకాల స్వప్నం మాత్రం నెరవేరుతుందనే పరిస్థితి కనిపించడం లేదు. గవర్నరుగా వెళ్లాలనేది ఆయన కోరిక. అందుకోసం చంద్రబాబును బాగా ఒత్తిడి చేశారు. మోడీ సర్కారు వచ్చాక.. గవర్నరు గిరీ వేయిస్తానని చంద్రబాబు మాట ఇచ్చారు గానీ.. పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన భాజపాలో చేరినంత మాత్రాన.. వారైనా వచ్చిన వెంటనే గవర్నరు పదవి ఇస్తారనుకోవడం భ్రమ.
తెలంగాణ దళిత నాయకత్వం కోణంలో భాజపా ఇంకా బలహీనంగానే ఉంది. ప్రస్తుతానికి మాజీ ఎంపీ వివేక్ చేరిక వారికి కొంత ఆసరా. మోత్కుపల్లి కూడా చేరితో.. వారు మరింతగా దళితులకు కూడా దగ్గరయ్యే ప్రణాళికలు వేసుకుంటారు. అంతే తప్ప.. వచ్చిన వెంటనే ఆయన గవర్నరు కుర్చీలో మాత్రం కూర్చోబెట్టరు అని పలువురు విశ్లేషిస్తున్నారు.