నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ ..వైసీపీ వెర్ష‌న్ ఒకలా.. టీడీపీ వెర్ష‌న్ మ‌రోలా

తెలుగు జ‌నాలు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తోన్న  ఏపీలోని నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ బుధ‌వారం తీవ్ర ఉత్కంఠ మ‌ధ్ స్టార్ట్ అయ్యింది. ఉద‌యం 7 గంట‌ల‌కే ప్రారంభ‌మైన పోలింగ్ 10 గంట‌ల‌కే అన‌ధికారికంగా 22 శాతం వ‌ర‌కు పూర్త‌యిన‌ట్టు తెలుస్తోంది. నంద్యాల ఓట‌రు మంచి హుషారుగా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు బూత్‌ల వ‌ద్ద బారులు తీరారు.

ఇక నంద్యాల రూర‌ల్‌, గోస్పాడు మండ‌లాల్లో కొన్ని గ్రామాల్లో అయితే 10 గంట‌ల‌కే 40-50 శాతం పోలింగ్ పూర్త‌య్యింది. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2.09 ల‌క్ష‌ల ఓట‌ర్లు ఉన్నారు. ఓవ‌రాల్‌గా 85 శాతం ఓటింగ్ న‌మోద‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పోలింగ్ స్పీడ్ చూసిన రాజ‌కీయ వ‌ర్గాలు, విశ్లేష‌కులు ఇది ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంద‌నే దానిపై ఎవ‌రి లెక్క‌ల్లో వారు మునిగి తేలుతున్నారు.

నియోజ‌క‌వ‌ర్గంలో 35 వేల యువ‌త ఓట‌ర్లుగా ఉన్నారు. వీరు ఎక్కువుగా ఓటు హ‌క్కు వినియోగించుకుంటే పోలింగ్ 80-85 శాతం మ‌ధ్య‌లో ఉంటుంది. ఇక పోలింగ్ శాతం పెరిగితే మాత్రం అది వైసీపీకి అత్యంత అనుకూల సంకేతంగా ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. పోలింగ్ శాతం పెర‌గ‌డం ప్ర‌భుత్వ వ్య‌తిరేకత‌ను సూచిస్తుంద‌ని వారు అంటున్నారు. 

టీడీపీ వెర్ష‌న్ మ‌రోలా ఉంది. ఓటింగ్ పెరిగితే భూమా సానుభూతి బాగా వ‌ర్క్ అవుట్ అవుతుంద‌ని, అది త‌మ‌కే క‌లిసి వ‌స్తుంద‌ని టీడీపీ వ‌ర్గాలు ధీమాతో ఉన్నాయి. ఇక మెజార్టీ విష‌యంలో కూడా ఎవ‌రి లెక్క‌లు వారికి ఉన్నాయి. టీడీపీ హీన‌ప‌క్షం 10 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తామ‌ని లెక్క‌లు వేసుకుంటోంది. ఇక వైసీపీ క‌నీసం 6 వేల‌కు త‌గ్గ‌కుండా 10 వేల వ‌ర‌కు గెలుస్తామ‌ని గెలుపుపై ధీమాతో ఉంది.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ గెలిచిన దివంగ‌త భూమా నాగిరెడ్డి 3600 ఓట్ల తేడాతో గెల‌వ‌గా, ఎంపీ అభ్య‌ర్థి ఎస్పీవై.రెడ్డికి మాత్రం 16 వేల మెజార్టీ వ‌చ్చింది. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో ఓట‌రు తీర్పు ఎటు వైపు ఉంటుందో ?  తెలియాలంటే ఈ నెల 28 వ‌ర‌కు ఆగాల్సిందే.