నంద్యాల‌లో భూమా ఫ్యామిలీ టార్గెట్‌గా వెన్నుపోటు రాజ‌కీయం

నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారం ముగిసేందుకు మ‌రో వారం రోజుల గ‌డువు మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ టైంలో అధికార టీడీపీలో లుక‌లుక‌లు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇక్క‌డ భూమా ఫ్యామిలీని టార్గెట్ చేసేందుకు టీడీపీలోనే కొంద‌రు తెర‌వెన‌క మంత్రాంగం చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. నంద్యాల‌లో భూమా ఫ్యామిలీ పాగా వేయ‌డం టీడీపీలోనే కొంద‌రికి న‌చ్చ‌డం లేదు. వాళ్లు ఇక్క‌డ పాగా వేస్తే త‌మ రాజ‌కీయ ఉనికికి ఇబ్బంది వ‌స్తుంద‌ని, త‌మ‌కు ప‌దోన్న‌తి ఉండ‌ద‌ని టీడీపీలోని కొన్ని వ‌ర్గాలు భావిస్తున్నాయి.

ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ ముందు నుంచి ఇక్క‌డ భూమాకు రైట్ హ్యాండ్‌గా ఉన్న సీనియ‌ర్ నాయ‌కుడు ఏవి.సుబ్బారెడ్డికి మంత్రి అఖిల‌ప్రియ‌కు విబేధాలు పొడ‌చూపాయి. దీంతో ఆయ‌న ప్ర‌చారంలో అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న భూమా ఫ్యామిలీతో క‌లిసి ప్ర‌చారం చేయ‌కుండా ఒంట‌రిగా ప్ర‌చారం చేస్తున్నారు. ఉప ఎన్నిక కోసం పార్టీ నిర్వ‌హించిన వ్యూహరచన సమావేశానికి కూడా ఆయన హాజరుకావడం లేదు. ఆయ‌న్ను బుజ్జ‌గించేందుకు ఎంత‌మంది ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఆయ‌న మాత్రం త‌న అల‌క వీడ‌డం లేదు.

సుబ్బారెడ్డి అల‌క వీడ‌కుండానే మరోవైపు నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి తన తీవ్ర అసంతృప్తిని బయటపెట్టారు. తన కూతురికి నంద్యాల టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయ‌న ర‌గిలిపోతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. నంద్యాల‌లో భూమా ఫ్యామిలీ పాగా వేయ‌డం వీరికి ఇష్టంలేదు. విధిలేకే తాను భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి ప్ర‌చారం చేస్తున్నాన‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు టీడీపీలో క‌ల‌క‌లం రేపాయి.

ఇవి పార్టీని ఇర‌కాటంలో ప‌డేయంతో వీటిని కొంద‌రు మంత్రులు సీఎం చంద్ర‌బాబు దృష్టికి కూడా తీసుకెళ్లారు. చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌ల విష‌యంలో ఎస్పీవై.రెడ్డికి ఫోన్ చేసి క్లాస్ కూడా పీకిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ ఇద్ద‌రు నాయ‌కుల‌తో పాటు మ‌రికొంద‌రు ద్వితీయ శ్రేణి నాయ‌కులు, వారి అనుచ‌రులు ఇప్పుడు నంద్యాల ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న వేళ భూమా ఫ్యామిలీకి వెన్నుపోటు రాజ‌కీయంతో చెక్ పెడుతున్నార‌న్న గుస‌గుస‌లు టీడీపీలోనే వినిపిస్తున్నాయి. వీటిపై టీడీపీ అధిష్టానం కూడా ఆందోళ‌న‌తోనే ఉంది.