వెస్ట్ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ఎమ్మెల్యే..!

ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చేందుకు కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో టీడీపీకి కొత్త అధ్య‌క్షుడు రానున్నాడా ? ప‌్ర‌స్తుతం ఉన్న జిల్లా పార్టీ అధ్య‌క్షురాలు, రాజ్య‌స‌భ స‌భ్యురాలు తోట సీతారామ‌ల‌క్ష్మికి బ‌దులుగా మ‌రో కొత్త వ్య‌క్తిని నియ‌మించ‌నున్నారా ? అంటే ప్ర‌స్తుతం జిల్లాలో జ‌రుగుతోన్న ప‌రిణామాలు అవున‌నే చెపుతున్నాయి. 2009 సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు తోట‌సీతారామ‌ల‌క్ష్మి జిల్లా ప‌గ్గాలు చేప‌డుతూ వ‌స్తున్నారు. అప్పటి నుంచి ఆమె జిల్లాలో పార్టీని ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా ఒంటిచేత్తో న‌డిపిస్తు వ‌స్తున్నారు.

గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు ఆమె అనూహ్యంగా రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా ఎంపిక‌య్యారు. ఆ త‌ర్వాత కూడా రెండుసార్లు ఆమెనే తిరిగి జిల్లా పార్టీ అధ్య‌క్షురాలిగా చంద్ర‌బాబు నియ‌మించారు. అయితే మ‌రోసారి రేసులో ఆమె ఉన్నా ఏలూరు ఎమ్మెల్యే బ‌డేటి బుజ్జి తాను సైతం జిల్లా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ఉంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో వెస్ట్ టీడీపీ జిల్లా అధ్య‌క్ష ప‌ద‌విపై ఉత్కంఠ నెల‌కొంది.

గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో టీడీపీ అన్ని ఎమ్మెల్యే స్థానాల‌తో పాటు ఎంపీ స్థానాలు క్లీన్‌స్వీప్ చేసేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోను అలాంటి ఫ‌లితాలే రాబ‌ట్టాల‌ని చూస్తోన్న చంద్ర‌బాబు ఇక్క‌డ జిల్లా పార్టీ ప‌గ్గాలు స‌మ‌ర్థులైన వ్య‌క్తుల‌కే అప్ప‌గించాల‌ని భావిస్తున్నారు. ఓ వైపు తోట సీతారామ‌ల‌క్ష్మితో పాటు మరోవైపు ఏలూరు ఎమ్మెల్యేఏ బ‌డేటి బుజ్జి ఎవ‌రికి వారు త‌మ‌కు మ‌ద్ద‌తుగా ఎమ్మెల్యేల‌ను కూడ‌గ‌ట్టుకుంటున్నారు. మ‌రి వీరిద్ద‌రిలోను చంద్ర‌బాబు ఎవ‌రికి ఓటేస్తారో చూడాలి.