ఆ జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వికి ఇంత పోటీనా?

ప్ర‌కాశం జిల్లా టీడీపీలో నాలుగు స్తంభాలాట మొద‌లైంది. దీనికోసం పార్టీలోని సీనియ‌ర్లు, కొత్త‌గా పార్టీలోకి వ‌చ్చిన నేత‌లు జోరుగా పావులు క‌దుపుతున్నారు. ఈ పీఠాన్ని ద‌క్కించుకుని త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తును కాపాడుకునేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఎవ‌రికి వారు లాబీయింగ్ చేసుకుంటూ.. హైక‌మాండ్ దృష్టిలో ప‌డేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రాజ‌కీయ అవ‌స‌రాల కోసం ఒక‌రు.. గుర్తింపు కోసం మ‌రొక‌రు.. ఇలా ఎవ‌రి అవ‌స‌రాలు వారివి అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. హైక‌మాండ్ ఆశీస్సులు పొందేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు.

ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్ష పీఠం కోసం విప‌రీత‌మైన‌ పోటీ నెలకొంది. మిగతా జిల్లాల్లో అధ్యక్ష పీఠం భారమని భావిస్తుంటే ఈ జిల్లాలో మాత్రం ఎలాగైనా దానిని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పుడు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న దామచర్ల జనార్దన్ ఇంకోసారి ఆ పోస్ట్ నిలబెట్టుకోడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. కానీ జిల్లా నుంచి సీఎం సహాయనిధి కి వచ్చిన దరఖాస్తుల విషయంలో ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు అవినీతికి పాల్పడినట్టు సీఎం పేషీ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉండటంతో ఇక జనార్దన్ కి అధ్యక్ష పీఠం కష్టమేన‌ని పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

ఇక ఈ పోస్ట్ కోసం వినిపిస్తున్న మూడు పేర్లలో ఇద్దరు వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కాగా, ఇంకొకరు కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన నాయకుడు. వైసీపీ నుంచి టీడీపీ లోకి వచ్చిన అద్దంకి, కందుకూరు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు స్థానికంగా ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో జిల్లా పగ్గాలు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ ఇద్దరూ తమ తమ పరిచయాలు, ఆర్ధిక వనరులు చూపి అధ్యక్ష పీఠం కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిలో పోతులకు గతంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప‌నిచేసిన అనుభవం ఉంది. గొట్టిపాటి రవికుమార్ కూడా రాజకీయంగా ఎదగాలంటే జిల్లా స్థాయిలో గుర్తింపు అవసరమని భావిస్తున్నారు.

ఇక ఈ పోస్ట్ కోసం ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరు కూడా బ‌లంగా వినిపిస్తోంది. ఆయన పేరుని అధిష్టానమే స్వయంగా పరిశీలిస్తున్నట్టు పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. కానీ మాగుంట పూర్తి సుముఖంగా లేరట. అందుకే ఆయన్ని ఒప్పించడం మీద హైకమాండ్ దృష్టి ఉంద‌ట‌. మ‌రి హైక‌మాండ్ ఆశీస్సులు ఎవ‌రి మీద ఉంటాయో.. ఎవ‌రు పార్టీ అధ్య‌క్షుడు అవుతారో వేచిచూడాల్సిందే!!